– రైతుకు సమయం.. డబ్బు ఆదా
– జాతీయ వేదికపై సత్తా చాటిన విద్యార్థిని సింధూజ
– బహుళార్థక వ్యవసాయ పరికరానికి
– జ్యూరీ సభ్యుల ప్రశంసలు
– మార్గదర్శకుడిగా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్య
మర్కుక్, ప్రజాతంత్ర, అక్టోబరు 13 : రైతు కష్టాన్ని తగ్గించే వినూత్న ఆలోచనతో దామరకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని బోయిన సింధూజ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. రైతుకు శ్రమ తగ్గించి, సమయం ఆదా చేసి, వ్యవసాయ పనులను సులభతరం చేయాలనే లక్ష్యంతో రూపొందించిన వినూత్న ప్రాజెక్టు అందరిని ఆకట్టుకుంది. బహుళార్ధక వ్యవసాయ పరికరాన్ని రూపొందించి,12వ జాతీయస్థాయి ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనలో జ్యూరీ సభ్యుల ప్రశంస లు అందుకుంది. గ్రామీణ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని చూపుతూ సింధూజ ప్రదర్శించిన ఆలోచన పలువురి దృష్టిని ఆకర్షించింది.
ఒకే పరికరంతో పది రకాల పనులు
సాధారణంగా వ్యవసాయంలో పురుగుమందులు, ద్రవ ఎరువులు పిచికారీ చేయడానికి ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తుంటారు. ఇతర పనుల కోసం వేర్వేరు సాధనాలు అవసరమవుతాయి. దీనివల్ల రైతులకు అదనపు ఖర్చుతో పాటు సమయం, శ్రమ కూడా ఎక్కువగా వెచ్చిం చాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచనతో సింధూజ’బహుళార్ధక పురుగుమందుల పిచికారీ యంత్రం బహుళ ప్రయోజన వ్యవసాయ పరికరం’అనే ప్రాజెక్టును రూపొందించింది. ఈ పరికరం కేవలం ద్రవాలను పిచికారీ చేయడానికే పరిమితం కాకుండా, కలుపు తీసే యంత్రం,గ్రాస్ కట్టర్, మినీ డోజర్, ఇలా పది రకాల వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించ డం దీని ప్రత్యేకత. ఒకే పరికరంలో విభిన్న పనులకు అనువైన సదుపాయాలను సమన్వయం చేయడం ద్వారా రైతులకు ఉపయోగక రమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలన్నది విద్యార్థిని లక్ష్యం..
శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సమస్యకు పరిష్కారం
ఈ ప్రాజెక్టు రూపకల్పనలో శాస్త్రీయ ఆలోచన, వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా పరికరాల అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పిచికారీ వ్యవస్థ ద్వారా ద్రవాలను పంటలకు అందించడం, ఒకే పరికరాన్ని వివిధ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునేలా రూపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ పనుల్లో ఉ పయోగించే పరికరాలను సమన్వయం చేయడం వల్ల వాటి నిర్వహణలో సౌలభ్యం కలగడంతో పాటు, అవసరాన్ని బట్టి వేర్వేరు సాధనాలపై పెట్టే ఖర్చును తగ్గించే అవకాశం ఉ ంటుంది. అయితే, పరికరం వాస్తవంగా ఎంతమేర ఖర్చును తగ్గిస్తుంది, పిచికారీ సామర్థ్యం ఎంత, వివిధ పనుల్లో దాని పనితీరు ఎలా ఉంటుందనే అంశాలను క్షేత్రస్థాయి పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది.
రైతుకు సమయం.. డబ్బు ఆదా చేయడమే లక్ష్యం
ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల్లో సాగు ఖర్చులు తగ్గించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించడం రైతులకు ఎంతో అవసరం. చిన్న, సన్నకారు రైతులకు అందుబాటు ధరలో బహుళ ప్రయోజనాలు అందించే పరికరాలు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సింధూజ రూపొందించిన ప్రాజెక్టు వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ఎలా అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించగలరో చాటిచెబుతోంది. ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి, క్షేత్రస్థాయిలో పరీక్షించి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది విద్యార్థిని ఆకాంక్ష. తన
ఆలోచన మరింతమంది రైతులకు చేరితే వ్యవసాయ పనులను సులభతరం చేయడంలో తోడ్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రగతి మైదాన్ లో జాతీయస్థాయి ప్రదర్శన
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఉన్న ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) హాల్ నంబర్ 5లో అక్టోబరు 12న ప్రారంభమైన 12వ జాతీయస్థాయి ఇన్స్పైర్ మానక్ ప్రదర్శన, ప్రాజెక్టు పోటీలు అక్టోబరు 14 వరకు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ జాతీయస్థాయి వేదికపై తెలంగాణ రాష్ట్రం నుంచి 52 ప్రాజెక్టులు ప్రదర్శనకు ఎంపిక కాగా, సిద్దిపేట జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో దామరకుంట విద్యార్థిని సింధూజ తన ప్రాజెక్టుతో పాల్గొనడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలుస్తోంది.
ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో వినూత్న ఆవిష్కరణ
దామరకుంట ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యరమాల చిన్న బ్రహ్మయ్య మార్గదర్శకత్వంలో సింధూజ ఈ ప్రాజెక్టును రూపొందించింది. విద్యార్థుల్లో పాఠ్యపుస్తక పరిజ్ఞానంతో పాటు, దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను శాస్త్రీయంగా పరిశీలించి పరిష్కారాలను అన్వేషించే నైపుణ్యాలను పెంపొందించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రయోగాత్మక అభ్యననం, సృజనాత్మక ఆలోచన,సమస్య ఆధారిత అభ్యసనం ద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయగలరని ఈ ప్రాజెక్టు మరోసారి నిరూపిస్తోంది.
విద్యార్థినికి అభినందనల వెల్లువ
జాతీయస్థాయి ప్రదర్శనలో సింధూజ ప్రాజెక్టుకు జ్యూరీ సభ్యుల నుంచి ప్రశంసలు లభించడంపై విద్యార్థిని బోయిన సింధూజతో పాటు మార్గదర్శక ఉపాధ్యాయుడు యరమాల చిన్న బ్రహ్మయ్యను అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి ఏ.వెంకట రాములు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు పి.బాల్రెడ్డి,గ్రామ సర్పంచ్ పత్తి నర్సింలు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కవిత వెంకటేశం, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





