ఏ పక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు

– ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : గత బీఆరఎస్ ప్రభుత్వంలో ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిమితమైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పార్టీల తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా చూస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిలతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో భూముల విలువ ఎకరాకు రూ.వందల కోట్లT ఉన్నప్పటికీ పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. క్యూర్ పరిధిలో మొదటి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, 23 నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటికే ఆరుచోట్ల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్ధాపనలు చేశామని వివరించారు. మేడ్చల్ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్దిదారులను పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారిని గుర్తించి అర్హతలను ధ్రువీకరించిన అనంతరం పారదర్శకంగా డ్రా నిర్వహించామని చెప్పారు. ఎంపికైన వారిలో స్థానికంగా నివసించే అర్హులనే నిర్ధారించి ఇళ్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లT మంజూరు చేశామని, ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ టవర్స్ కోసం మరోసారి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపికైన లబ్దిదారులకు కేవలం కేటాయింపు పత్రాలు ఇచ్చి సరిపెట్టబోమని, ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి అపార్టుమెంటుకు సంబంధించిన భూమిలో వాటాను కూడా రిజిస్ట్రేషన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తొలి విడతలో అవకాశం దక్కని అర్హులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులు సహా అర్హులందరినీ పరిశీలిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్దిదారులకు అందించడంతోపాటు ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు నిబంధనల ప్రకారం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.440 కోట్లు ఖర్చు చేశామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైౖర్మన్ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ శాఖ ఎండీ వి.పి.గౌతమ్, కలెక్టర్ మనూచౌదరి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో లబ్దిదారులు స్నేహ, శివకుమారి, రెహ్మాతి తదితరులు మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల పధకాన్ని, ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అనంతరం ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు జరిగింది.

వచ్చే దసరాకు మొదటి దశ ఇళ్ల పూర్తి : మంత్రి దుద్దిళ్ల

మొదటి దశలో కేటాయింపులు జరిగిన ఇందిరమ్మ ఇళ్లను ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని ఐటి, పరిశ్రమలు, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఏళ్లతరబడి నిర్మాణాలు కొనసాగేవని, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదని అన్నారు. పోచారంలో 480 మందికి కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. ఇందిరమ్మ టవర్స్‌కు రోడ్లు, మంచినీటి సదుపాయం, లిప్ట్ వంటి మౌలిక సదుపాయాలను గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ ఇచ్చిన మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, తెల్ల రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇళ్లు లేని పేదలకు వారి సొంత నియోజకవర్గం పరిధిలోనే ఇందిరమ్మ గృహాలను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. పోచారం ప్రాంతంలో సింగిల్ బెడ్ రూం కొనాలన్నా రూ.40 లక్షలు ఖర్చవుతుందని, అలాంటిది రూ.6 లక్షలు భరిస్తే అంతకంటే విలువైన ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఇళ్ల కేటాయింపులు అత్యంత పారదర్శకంగా మానవ ప్రమేయం లేకుండా లాటరీ పద్ధతిలో జరుపుతున్నామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *