- 18 రాష్ట్రాలలోని ఆర్వోఆర్‌ల అధ్యయనం తర్వాత రూపకల్పన
- గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో సమస్యలు
- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : తెలంగాణలో సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభారతి చట్టాన్ని(ROR New Bill 2024 ) రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శాసనసభలో మంత్రి భూభారతి బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇటువంటి అద్భుతచట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించడం మరచిపోలేని విషయమని అన్నారు.
1971లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్రజోపయోగంగా నిలిచిందని తెలిపారు. తర్వాత అర్ధరాత్రి నాలుగు గోడల నడుమ రూపొందిన ధరణి చట్టం వలన సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టిందని చెప్పారు. ధరణి పోర్టల్‌తో లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, నాటి ప్రతిపక్షనేత , నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పాదయాత్రల సందర్బంగా ధరణిని అరేబియా సముద్రంలో కలుపుతామని ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ మేరకు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా తమను నమ్మారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకుగాను ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతిని రూపొందించామని చెప్పారు.
తాము ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమేగాక ప్రత్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్‌లో పెట్టి ప్రజాప్రతినిధులు, కవులు , మేధావులు, విశ్రాంత అధికారుల సలహాలు సూచనలు స్వీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు 7 పేజీలు, వినోద్‌రావు 5 పేజీల సలహాలు . సూచనలు చేశారని వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. 33 జిల్లాలలో ఒక్కోరోజు ప్రత్యేక చర్చావేదికలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు.
18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్‌లపై అధ్యయనం
18 రాష్ట్రాలలోని ఆర్వోఆర్‌లను అధ్యయనం చేసి , ఉత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని భూభారతిలో పొందుపరిచామని మంత్రి తెలిపారు ధరణ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కేసముద్రం మండలం నారాయణపురంలో కె. రవి అనే ఎంపీటీసీ సభ్యులు భూ సమస్యలను బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలందరి దృష్టికి తీసుకువెళ్లారని , ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదని చెప్పారు. అంతేగాక సర్వేనెంబర్లు 149,150, 154,156, 168 తదతరాల్లోని 1398 ఎకరాల భూమి తరతరాలుగా అక్కడి గిరిజనుల సాగుబడిలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణి -2020 ఆర్వోఆర్ చట్టం వచ్చాక వారి హక్కులకు భంగం వాటిల్లేలా సదరు భూములు అటవీ భూములని తేల్చిచెప్పారని దీంతో గిరిజనులు తీవ్ర మనోవేదననకు గురయ్యారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 4 నెలల పాటు రిజిస్ట్రేషన్‌లు ఆపివేశారని, దీంతో భూములు అమ్ముకొని కుటుంబంలో పెళ్లిళ్లు, చదువుల కోసం ఖర్చుచేద్దామనుకొనే సామాన్య రైతులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని మంత్రి పొంగులేటి వివరించారు. భూభారతి బిల్లుకు సంబంధించి 22-23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నామని, అందువల్లే బిల్లు ప్రవేశపెట్టడంలో .జాప్యం జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు పూర్తిస్ధాయిలో ఉపయోగపడేలా బిల్లు తయారుచేసేందుకు కృషి చేశామని, సాదాసీదా బిల్లును ప్రజలపై రుద్దే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.