– అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
– కార్యాచరణతో ముందుకు సాగాలని సూచన
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై23:ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దీనినుంచి బయటపడేలా కార్యాచరణతో సాగాలని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్‌నినో ప్రభావంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయానికి సంబంధించి కరవు పరిస్థితిలో ఆరుతడి పంటలు వేయాలని అన్నదాతలకు సూచిస్తున్నామని అన్నారు. గ్రౌండ్ వాటర్ రోజురోజుకూ పడిపోతోందని.. దీనిని పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. వీబీజీ రాంజీ ఉపాధి హా పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రతి వర్షం చుక్కను కాపాడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ సమావేశంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమవతి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరా, సాగునీటి నిర్వహణ, పశుగ్రాసం, చెరువుల్లో నీటి నిల్వలు, ఇతర అత్యవసర చర్యలపై సక్ష నిర్వహించారు. తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రౌండ్ వాటర్ పెంపునకు ఇంకుడు గుంతల తవ్వకం, రైతులు ఆరుతడి పంటలు, ఆయిల్ ఫామ్ సాగు చేపట్లేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, అవసరమైన వనరులను సిద్ధంగా ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు.
ఎల్‌నినోతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం



