– కర్రెగుట్టల్లో టూరిజం అభివృద్ధి చేపడుతాం
-మావోయిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
– రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్
– మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత లొంగుబాటు
– రూ.20లక్షల రివార్డు అందజేత
– మరో 23మందికి రూ. కోటి 88 లక్షల రివార్డు పంపిణీ
– ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు సైతం రివార్డులు
– మావోయిస్టు నేతలతో ప్రత్యేక సమావేశం
ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 10: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలిపేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీని అమలు చేస్తున్నామని, అందులో భాగంగా మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత లొంగుబాటు జరిగిందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ములుగు జిల్లాలోని కర్రె గుట్టలను టూరిస్టు స్పాట్ గా అబివృద్ధి చేస్తామని, అదేవిధంగా మావోయిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కగార్ కు ముందు మావోయిస్టులు ఉండేవారని, ప్రస్తుతం మావోయిస్టులు లేరని, ఇంకా లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న మిగిలిన మావోయిస్టులు సైతం లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించి ప్రత్యేక శిక్షణ అందిస్తామని డీజీపీ వెల్లడించారు.
నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) రాష్ట్ర కమిటీ సభ్యురాలు, మహిళా సమస్యలు, వ్యూహాత్మక పార్టీ ప్రచార విభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న కాకరాల సమత అలియాస్ మాధవి, దుర్గ, షకీలా, మాసే సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ డిజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం సమతకు రూ. 20 లక్షల రివార్డును చెక్కు రూపంలో అందించడంతో పాటు రూ.25 వేల తాత్కాలిక ఆర్థిక సాయం అందించారు. పునరావాస విధానం కింద లభించే ఇతర ప్రయోజనాలను కూడా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
1985లో మావోయిస్టు ఉద్యమంలోకి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ఆర్యాపురానికి చెందిన సమత 1971 నుంచి 1984 వరకు చెన్నైలోని కర్ణాటక సంఘ హైస్కూల్లో చదువుకున్నారు. అనంతరం చెన్నై చర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్మీడియట్లో చేరి, 1985లో చదువును మధ్యలోనే నిలిపివేసి సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్లో చేరారు. కుటుంబ నేపథ్యం కూడా మావోయిస్టు భావజాలంతో ముడిపడి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ సినీ నటుడిగా సుమారు 300 సినిమాల్లో నటించారు. 1985లో విశాఖ జిల్లా మావోయిస్టు కమిటీలోని మహిళా విభాగంలో సభ్యురాలిగా చేరిన సమత 1991లో ఏరియా కమిటీ సభ్యురాలుగా, 1994లో డివిజన్ కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. హైదరాబాద్ నగర కమిటీతో పాటు మహబూబ్నగర్ నల్లమల ప్రాంతంలో పనిచేశారు. 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. అనంతరం తూర్పు ప్రాంతీయ బ్యూరో(ఈఆర్బీ), గోల్డెన్ కారిడార్ కమిటీ(జీసీసీ), దక్షిణ ప్రాంతీయ బ్యూరో (ఎస్ఆర్బీ) పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా సమస్యలు, వ్యూహాత్మక పార్టీ ప్రచార విభాగాల బాధ్యతలు నిర్వహించారు.
ఇద్దరు కీలక నేతలతో వివాహం
సమత 1991లో మావోయిస్టు నేత మేకల దామోదర్ రెడ్డి అలియాస్ మదన్నను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ కమిటీ మాజీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 1997లో మెదక్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. అనంతరం 2000లో సెంట్రల్ కమిటీ సభ్యుడు, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ సూర్యంను పెళ్లి చేసుకున్నారు. ఆయన 2009లో వరంగల్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.
మాజీ మావోయిస్టులకు ఆరోగ్య కార్డులు
తెలంగాణలో జనజీవన స్రవంతిలో చేరిన మావోయిస్టు కేడర్లకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పోలీసులు తెలిపారు. 2024 నుంచి 2026 మధ్య లొంగిపోయిన మావోయిస్టు కేడర్లకు ఆరోగ్య కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని, సోమవారం కొంతమందికి హెల్త్ కార్డులు అందించిన డీజీపీ త్వరలో అందరికీ కార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. పునరావాస విధానం కింద లభించాల్సిన అదనపు ప్రయోజనాలను కూడా అందించి, భద్రతతో జీవితాలను పునర్నిర్మించుకునేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
ఈ ఏడాది 265 మంది కేడర్ల లొంగుబాటు
తెలంగాణ పోలీసుల ప్రత్యేక నిఘా, సమన్వయంతో 2026లో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కీలక ఫలితాలు సాధించినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 265 మంది అజ్ఞాత సీపీఐ మావోయిస్ట్ కేడర్ లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. వీరిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు (సీసీఎం), 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు (ఎస్సీఎం), ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 24మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 94 మంది ఏరియా కమిటీ కార్యదర్శులు, 131 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నేతృత్వంలో తెలంగాణ గ్రేహౌండ్స్, జిల్లా పోలీసులు సమన్వయంతో చేసిన కృషి చేశారని డీజీపీ కొనియాడారు. సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత లొంగుబాటు మావోయిస్టు పార్టీకి నష్టమన్నారు. ప్రభుత్వ పునరావాస విధానం ప్రభావంతో మావోయిస్టు కార్యకలాపాలు క్రమంగా బలహీనపడుతున్నాయని, 2023లో 125 మంది, 2024లో 99 మంది, 2025లో 55 మంది లొంగిపోయినట్లు వివరించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టు నేతలు రాష్ట్రం వెలుపల సీపీఐ (మావోయిస్ట్) వివిధ నిర్మాణాల్లో పనిచేస్తున్నారని, కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు జాడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్లు ఉన్నట్లు తెలిపారు. సాయుధ పోరాటాన్ని విరమించి జనజీవన స్రవంతిలో చేరాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని కోరారు. సాధారణ ప్రజలతో పాటు లొంగిపోయిన మావోయస్టులు సైతం జీవనం గడపాలని సూచించారు. కొందరు మావోయిస్టు నేతలు రాజకీయాల్లోకి రావాలంటే ఏవైనా అనుమతులు కావాలా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు భారత పౌరులకు అన్ని అవకాశాలు ఉన్నట్లు వీరికి కూడా ఉంటాయని డీజీపీ సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ఏజెన్సీ గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ, ఛత్తీస్ఘడ్ బార్డర్ లో ఉన్న ములుగు జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి సమస్యలను సైతం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



