గోళ్ళలో సూదులుపెట్టి పొడిచినా, సిగరెట్లతో కాల్చినా, తలకిందులుగా వేలాడదీసి క్రింద మంటపెట్టినా, ఒకే తుపాకి గుండుకు ఎంతమంది బలి అవుతారనంటూ వందలాది మందిని ఒకరివెనుక ఒకరిని నిలబెట్టి కాల్చి వారి పైశాచిక అనందాన్ని తీర్చుకున్నా, సున్నంబొట్లుపెట్టి ఊరంతా ఊరేగించి నడిబజారులో కాల్చిచంపినా, ఆస్తులను దోచుకున్న, ఇళ్ళు నేలమట్టంచేసినా పోరాటబాట వీడని కుటుంబాలు తెలంగాణలోని ప్రతీ పల్లెటూరులో ఉన్నాయి.అంతటి త్యాగాలతో పునీతమైన ఈనేల స్వేచ్ఛావాయువలను పీల్చుకున్న ఈ సుదినాన్ని రాజకీయపార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్థంకోసం తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్నచందగా విభిన్నపేర్లను పట్టుకుని కూర్చున్నాయి. ప్రజలంతా సంఘటితంగా జరుపుకోవాల్సిన ఈ ఉత్సవానికి భిన్నంగా ఎవరికివారుగా జరుపుకోవడం నిజంగా శోచనీయం. ఇది పరోక్షంగా ‘తెలంగాణ’ ఉనికే ప్రమాదకారి.
( మండువ రవీందర్రావు )
హైదరాబాద్ స్టేట్ పాలన నుండి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించి నేటికి 76 ఏండ్లు అయింది. అప్పటి నుండి రెండు మూడు ఏండ్ల క్రితంవరకు తెలంగాణ ప్రజలు ఆ ప్రత్యేకరోజున వేడుకలను అధికారపూర్వకంగా జరుపుకోలేకపోవడం నిజంగా విచారించాల్సిన విషయం. రెండేళ్ళ క్రితంకూడా రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవాలన్న ఉద్దేశ్యంగానే ఉత్సవాలకు పిలుపునిచ్చాయేగాని, అంతకు ముందు ఈ వేడుకలను పెద్దగా పట్టించుకున్నదిలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాలనచేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కాలంలో తెలంగాణను ఉచ్చరించే పరిస్థితికూడా లేకపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాతకూడా పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం కోసం పద్నాలుగేళ్ళు ఉద్యమించిన బి(టి)ఆర్ఎస్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారికంగా ఈ ఉత్సవాలు జరుపాలని డిమాండ్ చేసింది. కాని, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2022 వరకు ఆ పార్టీకూడా అధికారికంగా ఉత్సవాలను జరుపలేకపోయింది. అందుకు అధికారంలో ఉన్న ఒక్కోపార్టీ ఒక్కో కారణం చెబుతూ వొచ్చాయి. కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన బిజెపి ప్రభుత్వం కూడా మొదటి ఎనిమిదేళ్ళు దీనిగురించి పట్టించుకోలేదు. కాని, 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణపై ఎట్టిపరిస్థితిలో కాషాయ జండాను ఎగురవేయాలన్న దృఢ సంకల్పంతో 2022 సెప్టెంబర్ 17న కేంద్రం ప్రభుత్వ పరంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. అప్పుడుగాని బిఆర్ఎస్ ప్రభుత్వానికి చురుకంటలేదు.
ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటిసారిగా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తలపెట్టింది. అయితే అప్పటికే వివాదగ్రస్తంగా ఉన్న సెప్టెంబర్ 17కు మరో కొత్త నామకరణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ‘ప్రజా పాలన దినోత్సవం’. నిజాంనుండి ఈ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న 1948 సెప్టెంబర్ 17ను ఏ పేరుతో పిలువాలన్న విషయంలో రాజకీయ పార్టీలకు 76 ఏళ్ళుగా ఏకాభిప్రాయం కుదరటంలేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పెట్టిన ఈ కొత్త నామకరణంతో అప్పుడే విభేదాలు మొదలైనాయి. రాష్ట్రంనుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్రమంత్రులు అప్పుడే తమ అసమ్మతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు’ హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఘనులశాఖమంత్రి జి. కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌లను అహ్వానిస్తూ లేఖలు పంపారు.
అయితే రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లు ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అర్థ శతాబ్ధకాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. అందుకే దీన్ని ‘ప్రజా వంచన దినోత్సవం’గా జరుపుకోవాలని సూచించారు. చిరకాలంగా తాము పిలుస్తున్నట్లు సంబంధిత రోజును ‘విమోచన దినోత్సవంగా’నే ప్రభుత్వం నిర్వహిస్తే తాము ఆ ఉత్సవాల్లో ముఖ్యంగా తాను పాల్గొనేందుకు అభ్యంతరంలేదని మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారు. ఇదిలా ఉండగా అప్పటికే కేంద్ర సాంస్కృతికశాఖ అధ్వర్యంలో విమోచన ఉత్సవాలను నిర్వహించే ఏర్పాట్లను బిజెపి ప్రారంభించింది. గతంలో సికింద్రాబాద్ పర్యడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినట్లుగానే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా హైదరాబాద్ దక్కన్ సంస్థానం విలీనమైన పవిత్ర రోజును ‘జాతీయ సమగ్రతా దినోత్సవంగా’ జరుపుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ దీన్ని ‘సమైక్యతా దినోత్సవంగా’నే పిలుస్తున్న విషయం తెలిసిందే.
రాచరికానికి చరమగీతంపాడి అసలైన ప్రజాస్వామ్యం పరిడవిల్లిన రోజు 1948 సెప్టెంబర్ 17. హైదరాబాద్ సంస్థాన ప్రజలు తాము స్వతంత్ర భారతదేశంలో భాగస్వాములమైనామని ఊపిరి పీల్చుకున్న రోజు. అందుకే ఇది తెలంగాణ చరిత్రలోనే అత్యంత ప్రధానమైంది. ఈ సుదినం కోసం సుదీర్ఘ పోరాటాలు చేసిన త్యాగధనులెందరో.. రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు, చండ్ర రాజేశ్వర్‌రావు, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప్‌రెడ్డి, దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, షోయబుల్లాఖాన్, బత్తిని మొగిలయ్యగౌడ్ ఇలా వందలు వేల మంది త్యాగఫలం సెప్టెంబర్ 17. అంతేకాదు.. ‘నిజామనగ ఎంతరా…వాడి తాహతెంతరా/ అంతగలసితంతె మల్ల వాడి అంతు లేదురా..’ అన్న కాళోజీÑ ‘ఓ నిజాం పిశాచమా కానరాడు నినుబోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని ఎలుగెత్తిన దాశరథి, ‘నైజాం సర్కరోడా, నాజీలను మించినోడా, గోలకొండ ఖిలా కింద నీ ఘోరి కడతం కొడుకో’ అన్న యాదగిరి లాంటి కవులు, కళాకారులు, తమ ప్రాణాలను లెక్కచేయకుండా తిరుగుబాటు చేసినవారందరినీ స్మరించుకోవాల్సిన రోజిది.
గోళ్ళలో సూదులుపెట్టి పొడిచినా, సిగరెట్లతో కాల్చినా, తలకిందులుగా వేలాడదీసి క్రింద మంటపెట్టినా, ఒకే తుపాకి గుండుకు ఎంతమంది బలి అవుతారనంటూ వందలాది మందిని ఒకరివెనుక ఒకరిని నిలబెట్టి కాల్చి వారి పైశాచిక అనందాన్ని తీర్చుకున్నా, సున్నంబొట్లుపెట్టి ఊరంతా ఊరేగించి నడిబజారులో కాల్చిచంపినా, ఆస్తులను దోచుకున్న, ఇళ్ళు నేలమట్టంచేసినా పోరాటబాట వీడని కుటుంబాలు తెలంగాణలోని ప్రతీ పల్లెటూరులో ఉన్నాయి.అంతటి త్యాగాలతో పునీతమైన ఈనేల స్వేచ్ఛావాయువలను పీల్చుకున్న ఈ సుదినాన్ని రాజకీయపార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్థంకోసం తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్నచందగా విభిన్నపేర్లను పట్టుకుని కూర్చున్నాయి. ప్రజలంతా సంఘటితంగా జరుపుకోవాల్సిన ఈ ఉత్సవానికి భిన్నంగా ఎవరికివారుగా జరుపుకోవడం నిజంగా శోచనీయం.
ఇది పరోక్షంగా ‘తెలంగాణ’ ఉనికే ప్రమాదకారి. రానున్న తరాలకు ఈ పక్షాలే జవాబుదారి అవకపోవు. అయితే ఇక్కడ ఒకరి గురించి మాత్రం తప్పక చెప్పుకోవాల్సి ఉంది. ఎవరు తనతో కలసివచ్చినా రాకపోయినా ఒక్కడైనా సరే నాటి పదిజిల్లాల జండాను ఈ రోజున తప్పక ఎగురవేసేవాడు. తెలంగాణ గాంధీగా పేరు తెచ్చుకున్న ఆయనే భూపతి కృష్ణమూర్తి. క్విట్ ఇండియా ఉద్యమం మొదలు, తెలంగాణ మలివిడుత ఉద్యమంవరకు నిరంతర పోరాటం చేసిన వ్యక్తి. సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నా ఆయన ఎన్నడూ తనకోసం ఏదీ చేసుకోని వ్యక్తి. తెలంగాణ వచ్చిన తర్వాతకూడా 1969 అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని 2015 ఫిబ్రవరి 16న ఆయన చనిపోయేవరకు కూడా ప్రభుత్వాలను అభ్యర్థిస్తూ వచ్చిన నిస్వార్థపరుడు.