పాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శం

– ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం
– రాష్ట్రవ్యాప్తంగా మ‌రో 14 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్

సత్తుపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, తెలంగాణ మోడల్ పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి ఆహార భద్రత, సాగునీరు అందించడమే ఈ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. వైద్యం, విద్యను రెండు కళ్లుగా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన నొక్కి చెప్పారు. సత్తుపల్లి ప్రజల కోసం నిర్మించిన వంద పడకల హాస్పిటల్‌ను భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డితో క‌లిసి ప్రారంభించారు. నియోజకవర్గంలోనే అదనంగా కల్లూరులో 50 పడకల హాస్పిటల్‌ను, పెనుబల్లిలో 30 పడకల హాస్పిటల్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్య విద్యను ప్రోత్సహించే దిశగా సత్తుపల్లిలో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నామని, ఒక్కో పాఠశాలకు సుమారు రూ.200 కోట్లT వెచ్చిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారÁT. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదివే విద్యార్థుల డైట్ చార్జీలను 40% మేర, కాస్మెటిక్ చార్జీలను 200% మేర పెంచినట్లు వివరించారు. జూన్ 2 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయంపూట అల్పాహారంతోపాటు ఒక గ్లాసు పాలు, రాగి జావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో అనేక విద్యుత్ సబ్‌స్టేషన్లతోపాటు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఎకో టూరిజం ప్రాజెక్టును కూడా ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లాలో గతంలో 4,11,143 రేషన్ కార్డులు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదనంగా 57,088 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా 3,40,236 ఎకరాలకు సాగునీరు అందుతుండగా ప్రస్తుత ప్రభుత్వం అదనంగా 3,16,264 ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, పనుల కోసం ఇప్పటికే రూ.2,500 కోట్లు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం, ప్రతి కుటుంబానికి ఆహార భద్రత సాగునీరు అందించడమే ఇందిరమ్మ రాజ్యపు ప్రధాన సంకల్పం అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు

సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని, ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సహాయమని తెలిపారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు ప్రతి వారం తమ ఇంటి నిర్మాణ ప్రగతిని అప్‌లోడ్ చేస్తే,అధికారులు వెంటనే బిల్లులు చెల్లించేలా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

పర్యాటక రంగం అభివృద్ధి

సత్తుపల్లి సమీపంలోని పులిగుండాల చెరువు, కనకగిరి హిల్స్ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక పటంలో నిలిచేలా ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతం రాష్ట్రానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు అండ్ స్కిల్ యూనివర్సిటీ

సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా, ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సెంటర్లలో అడ్మిషన్లు కల్పిస్తామని, శిక్షణ పొందే ప్రతి విద్యార్థికీ నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందజేస్తామని ప్రకటించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఈ టెక్నాలజీ సెంటర్లను దానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. టాటా వంటి సంస్థల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు దక్కేలా శిక్షణ ఇస్తామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *