మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్ కు నో

– వ్యతిరేకంగా ఓటేస్తామన్న ఖర్గే
– ఖర్గే నివాసంలో ఇండి కూటమి భేటీ

న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తామని ప్రకటించింది. కాగా, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ రెండు బిల్లులను గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు, బిల్లులకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి దిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున బుధవారం భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కూటమి నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్లపై అనాడైనా ఈనాడైనా కాంగ్రెస్‌ది ఒకటే స్టాండ్ అని పేర్కొన్నారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ట్రిక్కులకు వ్యతిరేకమని, మహిళా రిజర్వేషన్లు అంటూ దొంగ దారిలో డీలిమిటేషన్ అమలు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా వోటేస్తామని కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలియజేశారు. డీలిమిటేషన్‌పై ఇండి కూటమి పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హడావుడిగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెడుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో సమష్టిగా పోరాడుతామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండి కూటమి అనుకూలమేనని, కానీ దానిని తీసుకొచ్చే విధానంపైనే అభ్యంతరాలు ఉన్నాయని ఖర్గే చెప్పారు. రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్‌ను ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని అధికారాలన్నింటినీ కార్యనిర్వాహక వర్గం తీసుకుంటోందన్నారు. ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. కనీసం జనగణన కూడా పూర్తి చేయకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కొత్త జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *