వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్న ‘దత్తత’ దందా!

తెలంగాణ రాష్ట్రంలో పసిబిడ్డలు, చిన్నారుల అక్రమ దత్తత, మానవ అక్రమ రవాణా అంశాన్ని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 22న స్వయంగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (సూమోటో) స్వీకరించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ అక్రమ నెట్‌వర్క్‌ల విస్తృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక పసికందు కస్టడీకి సంబంధించిన వ్యక్తిగత కేసును విచారిస్తున్న క్రమంలో, వెలుగులోకి వొచ్చిన విస్తుపోయే వాస్తవాలు రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా సాగుతున్న పసికందుల విక్రయాల దందాను బట్టబయలు చేశాయి. ఇది కేవలం ఒక చట్టపరమైన ఉల్లంఘన మాత్రమే కాదు, సమాజ నైతికతను నివేదికలు చెబుతున్న భీతిల్లజేసే వాస్తవాలు మహిళా శిశు సంక్షేమ శాఖ, హోంశాఖ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలు సమర్పించిన నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 176 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో విక్రయదారులు, కొనుగోలుదారులు, హాస్పిటల్  సిబ్బంది, మధ్యవర్తులు ఉన్నారు. పోలీసులు వేర్వేరు ప్రాంతాల నుంచి 61 మంది చిన్నారులను రక్షించి ప్రభుత్వ శిశు గృహాలకు తరలించారు.

అత్యంత దారుణమైన విషయమేమిటంటే, ఈ చిన్నారులలో 27 మంది తల్లిదండ్రులను మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన 26 కేసులలో పిల్లల కన్నతల్లిదండ్రుల ఆచూకీ లభించలేదు, వారిని చేరవేసిన మధ్యవర్తులు పరారీలో ఉన్నారు. ఈ పసికందులను యాచకవృత్తికో, లేదా అంతకంటే ఘోరమైన అవయవ రవాణా కోసమో విక్రయించి ఉంటారనే అనుమానాలు కలుగకమానవు .  ప్రశ్నిస్తున్న తీవ్రమైన మానవీయ సంక్షోభం. దేశంలో అధికారికంగా దత్తత ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర దత్తత వనరుల సంస్థ (కారా) మార్గదర్శకాలు,  జువైనల్ జస్టిస్ (జేజే) చట్టం-2015 అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ, నిబంధనలను తుంగలో తొక్కి సమాంతరంగా ఒక నల్లబజారు నడుస్తుందంటే  పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది . దత్తత తీసుకోవాలనుకునే దంపతుల సుదీర్ఘ నిరీక్షణను ఆసరాగా చేసుకుని, హాస్పిటల్స్ , ఆర్ఎంపీలు, నర్సింగ్ హోమ్‌ల కేంద్రంగా మధ్యవర్తులు ఈ దందాను సాగిస్తున్నారు.

పేదరికం, సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న గిరిజన తండాలు, అణగారిన వర్గాల తల్లిదండ్రుల బలహీనతలను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పుట్టిన వెంటనే జనన ధృవీకరణ పత్రాల నమోదు సక్రమంగా జరగకపోవడం కూడా ఈ అక్రమ రవాణాకు అనుకూలంగా మారుతున్నది . తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని లంబాడా తండాలు, వెనుకబడిన ప్రాంతాల నుండి ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పేదరికం, ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టడం వంటి కారణాల వల్ల దలారులు తల్లిదండ్రులను లోబరుచుకుంటున్నారు. కేంద్ర దత్తత వనరుల సంస్థ (కారా) ద్వారా చట్టబద్ధంగా దత్తత తీసుకోవడానికి భారతదేశంలో సగటున 3 నుండి 4 సంవత్సరాల సమయం పడుతుంది . దాదాపు 30,000 పైగా దంపతులు నిరీక్షణ జాబితాలో ఉండగా, లభ్యతలో ఉన్న పిల్లల సంఖ్య కేవలం 2,000 నుండి 3,000 మాత్రమే ఉంది. ఈ సుదీర్ఘ నిరీక్షణే నిస్సహాయులైన దంపతులను బ్లాక్ మార్కెట్ వైపు నెడుతున్నది .

రాష్ట్రంలో పసిబిడ్డల విక్రయాలు, అక్రమ దత్తతలను అరికట్టడానికి పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ రెండు వ్యవస్థల మధ్య సమాచార మార్పిడి లోపం వల్లే నిందితులు చట్టాల నుంచి సులభంగా తప్పించుకుంటున్నారు.  హాస్పిటల్స్  లేదా గిరిజన తండాలలో అనుమానాస్పద ప్రసవాలు లేదా పిల్లల అదృశ్యంపై ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం ఉన్నా, అది సకాలంలో పోలీసులకు చేరడం లేదు. పోలీసులు పిల్లలను రక్షించినప్పుడు వారిని ఉంచడానికి తగిన ప్రభుత్వ శిశు గృహాల కొరత ఉంటున్నది . అలాగే, శిశు సంక్షేమ శాఖ దాడి చేసినప్పుడు నిందితులను బంధించడానికి పోలీసుల తక్షణ మద్దతు లభించడం లేదు. ప్రతి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ అధికారి,జిల్లా బాలల రక్షణ అధికారి లతో కూడిన ప్రత్యేక పోలీస్ విభాగాన్నినిరంతరం సమన్వయం చేసే శాశ్వత యంత్రాంగం ఏర్పాటు కావాలి. హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, రాష్ట్రంలో జువైనల్ జస్టిస్ చట్టం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవుతున్నదో  లేదో సమీక్షించాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ పరిణామం.

కేవలం నల్గొండ శిశుకేంద్రం వ్యవహారమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాలల సంరక్షణ కేంద్రాలు, ఐసిపిఎస్ వ్యవస్థల తీరుపై ఉన్నత న్యాయస్థానం నిఘా పెట్టడం తక్షణ అవసరం. నిందితులపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవడంతో పాటు, అసలు కన్నవారి ఆచూకీ కనుగొనడంపై పోలీసు విభాగాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోర్టు ఆదేశించింది. చిన్నారుల సంరక్షణ కేవలం పోలీసులకో, శిశు సంక్షేమ శాఖకో పరిమితమైన అంశం కాదు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీల సమన్వయంతో పసిపిల్లల పుట్టుక, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి. హాస్పిటల్స్, ప్రైవేట్ ప్రసవ కేంద్రాలలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. అనధికారిక దత్తత శిక్షార్హమైన నేరమనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ‘కారా ’దత్తత ప్రక్రియను మరింత సరళతరం చేసి, పారదర్శకంగా మార్చాలి. న్యాయస్థానం చొరవతోనైనా ప్రభుత్వం నిద్ర మేల్కొనాలి. వ్యవస్థల మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్ది, మానవత్వానికే మచ్చ తెస్తున్న ఈ ‘పసికందుల విక్రయాల’ నెట్‌వర్క్‌లను సమూలంగా అణచివేయాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో పసిబాల్యానికి అసలైన రక్షణ లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *