పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

– యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ప్రాధాన్యత
– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
– గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్ కార్యక్రమంగా ఐఆర్‌సీ
– ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంతోపాటు స్థానిక యువతకు నైపుణ్యానికి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. పికో టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఫౌండర్ సీఈఓ జారోడ్ యస్టర్, ఏఐసీవో జి.సీతారాం, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన ప్రారంభించారు. పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తూ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్త సంస్థల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాక యువతకు మెరుగైన భవిష్యత్తు అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్లోబల్ సమ్మిట్ పాలసీని తీసుకొచ్చామని, రాష్ట్ర పెట్టుబడుల సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలచిందని తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలను తెలంగాణకు ఆహ్వానించి, రాష్ట్రంలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసి పెట్టుబడులను ఆహ్వానించనున్నట్టు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడుల, నూతన ఆవిష్కరణలకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ఐటీ, సాంకేతిక సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, ప్రపంచస్థాయి కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు రావడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. పికో టెక్నాలజీ ఇండియా వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇలాంటి సంస్థల రాకతో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపుతోపాటు సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పెట్టుబడుల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికతకు అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్ కార్యక్రమంగా ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *