– ఏపీ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యజమానుల కోసమా?
– బుల్లెట్ ట్రైన్‌ను అడ్డుకుంటున్నది ఈ అదృశ్య శక్తే
– శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ రైలు మార్గం అలైన్మెంట్ మార్చొద్దు
– ఇందుకోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోరా?
– 66 రోజులుగా నిరాహార దీక్షలు
– వేడెక్కుతున్న సూర్యాపేట
– వాణిజ్య కేంద్ర సూర్యాపేటపై ఇంకా నిర్లక్ష్యమా?
రమణాచారి, హైదరాబాద్, నవంబర్ 6 : జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ విషయంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని చెప్పక తప్పదు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణకు ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని చెప్పడమేకాదు, ఈ ట్రైన్ గతంలో కేంద్రం ప్రకటించిన అలైన్మెంట్ ప్రకారం జాతీయ రహదారి 65కు సమాంతరంగా సూర్యాపేట మీదుగా నిర్మిస్తామని స్పష్టం చేయకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అలైన్మెంట్ మార్పుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు వివిధ ఛానల్లో ప్రసారమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయమై స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ద్వంద వైఖరిలా కనిపిస్తుంది. రాష్ట్ర విభజన చట్టం, షెడ్యూల్ 13 ప్రకారం ఉమ్మడి రాష్ట్రాలు రాజధానులు కలుపుతూ హై స్పీడ్ రైలు ఇవ్వాల్సింది. అందుకోసం రెండేళ్ల క్రితం శంషాబాద్ టు వైజాగ్ ఈ మార్గం గుండానే సర్వే చేశారు. ఏకారణాలవల్లనే అది ముందుకు పోలేదు. మొదటి నుండి ఆంధ్ర పెట్టుబడిదారుల, ఆంధ్ర పెత్తందారుల లాబీయింగ్ తోనే తెలంగాణ నష్టపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వారే ఆటంకాలు కల్పించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వేలాది బస్సులు హైదరాబాదుకు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. లాభాల పంట పండించే ఈ మార్గం గుండా రైల్వే కారిడార్ ఏర్పడితే, ఆంధ్ర ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యజమానులకు లాభాల సంగతి పక్కనపెట్టి, వారి వాహనాలు షెడ్యూల్ పోవాల్సిందే. ఇది బయటకు ప్రజలకు కనిపించని అదృశ్య శక్తి. బుల్లెట్ ట్రైన్ ఆగమనాన్ని కూడా ఈ శక్తులే ప్రభావితం చేస్తున్నాయని ఉద్యమకారులు, బుద్ధి జీవులు ఎలువెత్తి చాటాల్సి ఉన్నది.
జాతీయ రహదారి 65 వెంట ఉన్న సూర్యాపేట పట్టణం ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965 ప్రకారం జనాభా, ఆదాయ వనరుల ఆధారంగా మున్సిపాలిటీగా ఏర్పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రైల్వే స్టేషన్ ఏర్పాటు జరిగి ఒకటిన్నర శతాబ్దం దాటినా సూర్యాపేటకు రైలు మార్గం లేదు. అనేకమార్లు వివిధ మార్గాల్లో సర్వేలు జరిగినా బడ్జెట్ కేటాయించలేదు, రైల్వే స్టేషన్ రాలేదు. హైదరాబాద్ కు వాణిజ్య వ్యాపార కేంద్రం విజయవాడకు మధ్యలో ఉన్న అతిపెద్ద చరిత్రాత్మక ప్రాంతం సూర్యాపేట. సుధాకర్ పి.వి.సి. పాలిమర్స్ ఆసియా ఖండంలోనే ప్రముఖమైన పాత్ర. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతర సూర్యాపేటలోని దురాజ్ పల్లిలోనే జరుగుతుంది. ఒకప్పుడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ తెలంగాణలోనే అతిపెద్దది. నదీ జలాలు లేకపోయినా, చుట్టు-ముట్టు చెరువులు కలిగి పాడిపంటలతో అలరారిన ప్రాంతం. నాటి జాతీయ రహదారి తొమ్మిదిపై పేరెన్నికగన్న ప్రాంతం సూర్యాపేట. పిల్లలమర్రి దేవాలయాలు, ఉండ్రుగొండ దేవస్థానం, చరిత్రాత్మక వేణుగోపాల స్వామి, శివాలయాలకు ప్రసిద్ధి. తెలంగాణ ప్రాంత, ప్రధానంగా నల్లగొండ జిల్లా రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల అలసత్వ ధోరణి కారణంగా కృష్ణానదీ జలాలు ఈ ప్రాంతానికి దక్కకుండా పోయాయి. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించి ఆమోదించిన అలైన్మెంట్ ను మారుస్తూ రాష్ట్ర కేబినెట్ బుల్లెట్ రైలు రాకుండా అడ్డుపడుతోంది. దక్షిణ తెలంగాణ అభివృద్ధిని మరోమారు అడ్డుకుని ఆంధ్ర రాష్ట్రానికి లాభం చేకూర్చే ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నదన్న భావన బలపడుతున్నది.
హైదరాబాద్‌లో మొదటి రైల్వే స్టేషన్ 1874 అక్టోబర్ 9న ప్రారంభమైంది. మైసూరు పాలకుల వల్ల ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి, హైదరాబాద్‌ను సైనిక స్థావరంగా మార్చడానికి, హైదరాబాద్‌ను బొంబాయి, మద్రాస్ రైల్వే మార్గాలతో అనుసంధానించాలని ప్రతిపాదించారు. 1856లో లార్డ్ డల్హౌసీ చేసిన ఈ ప్రతిపాదనకు నిజాం ప్రభుత్వం అంగీకరించింది. 1873లో ప్రజల వాటాలతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌లో నిజాం ప్రభుత్వం 5లక్షల పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైల్వే ఇంజనీర్ ‘మీడీ’, వాడి మరియు హైదరాబాద్ మధ్య 2కోట్ల రూపాయల వ్యయంతో 110 మైళ్ల బ్రాడ్ గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం 1874 అక్టోబర్ 9న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 1874 నుండి 1878 వరకు ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్’ సంస్థ ఈ మార్గాన్ని నిర్వహించింది. 1930 ఏప్రిల్ 1న నిజాం ప్రభుత్వం ఈ మార్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, రైల్వే మార్గాలను 1924 ఫిబ్రవరి 1న వరంగల్ వరకు, 1928 నవంబర్ 15న బలార్షా వరకు పొడిగించారు. 1966 అక్టోబర్ 2న ‘దక్షిణ మధ్య రైల్వే’ ఏర్పాటైంది. హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనమై ఏళ్లు గడుస్తున్నది.కానీ, హైదరాబాద్ కు అత్యంత సమీపంగా జాతీయ రహదారి అప్పుడు 9 ఇప్పుడు 65 కు రైలు మార్గం లేకపోవడం ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం అంటే అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో జాతీయ రహదారి 65 కు స్థానం లేకుండా చేయడమే. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విధివిధానాలకు పూర్తిగా విరుద్ధమైనది. వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుందనే సాకుచూపి, అధిక జనాభా కలిగిన ప్రాంతాల/ పట్టణాల నుండి ప్రజలను రవాణా సౌకర్యానికి దూరం చేయడమే. రైలు విజయం ప్రయాణికుల రద్దీ, ఆర్థిక నిర్వహణపైన, ప్రాంతాల అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర రాజధానులు అమరావతి – హైదరాబాద్ కలిపే మార్గాన్ని ప్రజలకు దూరం చేయడం. మరో రకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలోని ప్రైవేట్ బస్ సర్వీసు యజమానుల ఒత్తిడికి తలొగ్గడమే. వారి లాభాపేక్షకు నిబంధనలు తుంగలో తొక్కడమే. జాతీయ రహదారి 65 పై జరిపిన సర్వే ప్రకారం ప్రతిరోజు సూర్యాపేట మీదుగా హైదరాబాదుకు, హైదరాబాదు నుండి సూర్యాపేట మీదుగా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఆరు లక్షలు. అంటే ఈ దారి ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటుంది. అందువల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి. కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. పండగలు పబ్బాల కాలంలో టోల్ గేట్స్ దగ్గర గంటల కొద్ది నిరీక్షణ తప్పడం లేదు. ప్రయాణ సమయం వృధా అవుతోంది. విద్యా,వైద్య, ఉద్యోగ – ఉపాధి రంగాల్లో, వ్యాపార – వాణిజ్య సంఘాలకు అత్యంత ప్రయోజనకరమైనది స్పీడ్ రైలు. శంషాబాద్ చెన్నై వయా సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ రూట్ అలైన్‌మెంటును మార్చడం అంటే ప్రజల ఆకాంక్షలను బలి చేయడమే. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ రైలు కారిడార్లకు ప్రతిఫలం రావాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం నుండి ఏర్పాటు జరగాల్సి ఉంది. వివిధ పట్టణాలను, జిల్లా కేంద్రాలను కలిపే మార్గం గుండా రైల్వే మార్గం ఉండాలి. ఈ శాస్త్రీయ పరిశోధనలను పట్టించుకోకుండా, విధి విధానాలను తుంగలో తొక్కి అలైన్మెంట్ పొందించాలని కుట్ర చేయడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుని ఏ ప్రభుత్వం దీర్ఘకాలం మనజాలదన్నది చారిత్రక సత్యం.
కేంద్రం అలైన్మెంట్ ప్రకటించిన శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ 12 వారాలుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయి. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాల అందించడం, పొలికేక ద్వారా పొలికేక పెట్టడం, సంపూర్ణ పట్టణ బంద్ తో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ కుల సంఘాలు, వృత్తి సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మహిళా సంఘాలు… 66 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం రోజురోజుకు వేడెక్కుతోంది. మాకు ప్రకటించిన రైలు మార్గ అలైన్మెంట్ ను మార్చితే సహించబోమని తేల్చి చెబుతున్నారు. ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్, మైనార్టీలు సైతం దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలుకుతున్నారు. అన్ని వర్గాల, కులాల, వృత్తుల ప్రజలు భాగస్వాములవుతూ తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే తగిన బుద్ధి చెబుతామని రాజకీయ పార్టీలకు, పాలక ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తున్నారు. అరేంజ్మెంట్ ప్రకటించాం కాబట్టి తమకేం సంబంధం లేదన్నట్టు కేంద్ర ప్రభుత్వం, ల్యాండ్ అక్విడిజేషన్ బాధ్యత తమకు అప్పగించారు కాబట్టి తామనుకున్నట్టుగా కొత్త అలైన్‌మెంట్‌కు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఈ విషయంలో ప్రజలతో దోబూచులాడుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేరల దాకా తన్ని తరుముతాం! ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం!” అని ప్రజలు నినదిస్తున్నారు. విశాల ప్రజా బాహుళ్యాన్ని కలుపుకొని, ఉద్యమకారులు పోరాటాన్ని మరింత ఉదృతం, విస్తృతం చేస్తే బుల్లెట్ ట్రైన్ ఈ మార్గం గుండా తప్పకుండా వస్తుంది. శాసనమండలి ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి. ఆ తర్వాత జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఈ ఉద్యమ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది నిర్వివాదాంశం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





