“కనీసం ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపి పోరాడలేని కమ్యూనిస్టు ఐక్యత మాటలకే తప్ప చేతల్లో మచ్చుకీ కనపడదు.అప్పుడప్పుడు ప్రజాసమస్యలపై కలిసి పనిచేసిన స్ఫూర్తి ని కూడా బూర్జువా పార్టీల కు దారాదత్తం చేయడానికి వెనకాడని అవకాశవాద నాయకత్వం ఇక్కడ ఉంది.కమ్యూనిస్టులు కూడా వ్యక్తి గత స్వార్థం,లబ్ది ఆలోచనలు నుండి బయటపడటం వరకు కమ్యూనిస్టు ఐక్యత ఒక పగటి కల మాత్రమే.ఎర్రజెండాల ఐక్యత ఎవరికి వారు అవసరానికి మాట్లాడే అందమైన ఉపన్యాసం,నినాదం తప్ప ఆచరణలో ఆవగింజంత ముందుకు పోయినట్లు కనపడదు..”

(పొలిటికల్ ఎనలిస్ట్, రచయిత, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514
ఇప్పుడు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ సార్ కమ్యూనిస్టు లను అడగాల్సిన మోదటి ప్రశ్న నమ్మకమా?అమ్మకమా? మీరెటు వైపు ! నమ్మకం లేనిచోట అమ్మకం ప్రాధాన్యత వహిస్తుంది.అమ్మకం ఉన్నచోట నమ్మకం అదృశ్యం అవుతుంది.చదువరులకు కాస్తా గందరగోళం అనిపించినా! కమ్యూనిస్టు ఐక్యతకు ఇదో సైద్ధాంతిక సరళరేఖ! దీన్ని బట్టి నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో? మాఇంటికి మీ ఇల్లు అంతే దూరం!? ఈ ప్రశ్న కు లెఫ్టిస్ట్,రైటిస్టు కమ్యూనిస్టు పార్టీల ఐక్యతా కహానీలు ఎట్లుంటయో ప్రజలకు తెలుస్తొంది.వారి సైద్ధాంతిక నిబద్దత కూడా లోకానికి అర్థం అవుతుంది.ఎవరికి వారు అవకాశవాదానికి ఆమడ దూరం అని చెప్పడమే కానీ,అవసరం వచ్చినప్పుడు ఆశ్రిత వాదం కు అంగుళం కూడా సందు దొరకదు.ఈ మతలాబు చంద్రకుమార్ తెలుసుకుంటే మంచిది.
ఇప్పటికే మాజీ హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ మరికొందరు ప్రజాస్వామ్య వాదులు తెలంగాణా లో మరో ప్రత్యామ్నాయం గా కమ్యూనిస్టు లు ఎందుకు రాలేరు?అందుకు కమ్యూనిస్టు ఐక్యత సాధ్యం ఎందుకు కాదు? ఇట్లాంటి సంక్లిష్టత ఉన్న సమస్యను నెత్తికెత్తుకొని ఓ పది, పన్నెండు కమ్యూనిస్టు గ్రూపులు ఉరఫ్ కమ్యూనిస్టు పార్టీలను పిలిచి భాగ్యనగరం లో ఓ సదస్సును ఏర్పాటు చేశారు.కమ్యూనిస్టు ఐక్యతకొరకు ఆయన చేసిన ప్రయత్నం లో అరడజను రైటు కమ్యూనిస్టు పార్టీలు,మరో అరడజను లెప్టు కమ్యూనిస్టు పార్టీలు అందునా ఒకే పేరుతో కొనసాగే విభిన్న నక్సల్స్ గ్రూపులు ఆయన పెట్టిన ఐక్యతా సదస్సుకు వెళ్ళి ఉపన్యాసాలు దంచి కొట్టాయి.
వందేళ్ళ కమ్యూనిస్టు పార్టీల ప్రస్థానం లో సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటే ఏకైక లక్ష్యం.కాకుంటే అందుకు అనుసరించే పంధాలే వేరు.అవికూడా రెండే రెండు పంధాలు.ఒకటి సాయుధ విప్లవమే ఏకైక మార్గం అయితే,మరొకటి జనతా ప్రజాస్వామ్య విప్లవం అంటే ఎన్నికల వ్యవస్థ ద్వారా కూడా అధికారం లోనికి రావడం.ఎర్రజెండాలవారు ఒకరినొకరు తిట్టుకున్నారు.అప్పుడప్పుడు కొట్టుకున్నారు.అడపాదడపా చంపుకున్నారు.అయినా ఎవరి పంథా ఎట్లున్నా అందరూ మాట్లాడేది అంతిమంగా మార్క్సిజం-లెనినిజమే! అందరూ అనుసరించేది వర్గ పోరాటమే? పోరాటం పేద ప్రజల కొరకే.అయినా ఈ దేశంలో రెండు పంథాలు విజయం సాధించలేదు . అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి.ఓటమి పాలయ్యాయి.సాయుధపోరాటం అనేక త్యాగాలతో ముడిపడి రక్తం తర్పణాలు తో ముగిసింది! ఇక శాంతియుత మార్పు అనేది తాము హతమై కుల,మత, ప్రాంతీయ పార్టీలకు ఊపిరి పోసింది.ఎన్నికల రంగులు,హంగుల్లో బొక్క బోర్లా పడ్డాయి.ఈదశలో ఓడిన లెప్టు,రైటు కమ్యూనిస్టు లంతా ఏకమై ప్రత్యామ్నాయంగా ముందుకు రావాలని వామపక్ష అభిమానులు,మేధావులు రాష్ట్రం లో ప్రయత్నం చేయడం తో పాటు కేంద్రం లో ఇటీవల ఆయా కమ్యూనిస్టు నేతలను కలిసి ఐక్యతా సదస్సుకోసం చేస్తున్న ప్రయత్నం ఆశలు చిగురిస్తున్నాయని ఓ ప్రకటన కూడా చేశారు.
మనస్సులు కలవాలంటే ముందు మనుషులు కలవాలి.జెండాలు కలవాలంటే ఎజెండాలు ఏకం కావాలి.కానీ, మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ కు తెలియని విషయం ఒకటుంది.ఇక్కడ కమ్యూనిస్టు వారెవరూ మాటమీద నిలబడే వారు కాదు.ముఖమాటం వాలు ఎక్కువ! ముఖం చాటు రాజకీయాలు పాలు మరికాస్తాఎక్కువ! అవకాశవాద రాజకీయాలలో ఆరితేరిన వారు.అంతెందుకు ఒకరి పొడమరొకరికి గిట్టని తత్వం నరనరాన జీర్ణించుకున్న సంకుచిత ధోరణులు జాస్తీ..! నిజంగానే ఐక్యతా దిశగా కమ్యూనిస్టు ప్రయాణం ఉండి ఉంటే నాలుగు వోట్లు కోసమో! రెండు సీట్లు కోసమో!!ప్లేటు ఫిరాయించేవారు కాదు.తెలంగాణారాష్ట్రం ఉదాహరణగా తీసుకుంటే ఒకవైపు ఐక్యతా చర్చలు, మరోవైపు విచ్చిన్నం రాజకీయ ఎజెండాలు వెన్నతో కాకుండా నెయ్యి తో పెట్టిన విద్యగా మార్చుకుంటున్నారు .
తెలంగాణా విషయానికి వస్తే పట్ట భద్రుల ఎన్నికలు పట్టాల మీదకు వచ్చింది.ఈ ఎన్నికల్లో నైనా లెప్టు,రైటు కమ్యూనిస్టు లంతా ఏకమై “లెప్టు-రైటు”ఏకమై వీధుల్లో ఎర్ర కవాతు చేస్తారనే కలలకు గండి కొట్టేసు కున్నారు.ఉమ్మడి అభ్యర్థిని పెట్టి పోటీ చేస్తారనే భావనలకు గండికొట్టి ఐక్యత మాటలు వరకే, చేతులు ఎవరి దారి వారిదే నని మరోసారి రుజువు చేశారు.ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్ట భద్రుల ఎన్నికల్లో సిపియం పార్టీ తమ ప్రజాసంఘాలు తరపున కొల్లి సత్యనారాయణ అనే ఓ న్యాయవాదిని పోటీకి నిలుపుతున్నట్లు ప్రకటించింది.మరికొన్ని లెప్టుపార్టీలు ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి.మరోవామపక్ష పార్టీ సిపిఐ తమ మద్దతు వామపక్ష అభ్యర్థికి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థికి ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.గత ఇదే శాసన మండలి ఎన్నికల్లో సిపియం పార్టీ, సిపిఐ అభ్యర్థి పార్థసారదికి బేషరతు మద్దతు నిచ్చింది.పాత పొత్తు ధర్మం విస్మరించి సిపిఐ తాజా పొత్తు ధర్మం కు జై కొట్టింది.
ఇక మిగిలిన వామపక్ష పార్టీలు సిపియం అభ్యర్థికి ఏమేరకు మద్దతు ఇస్తారో అర్థంకాని స్థితి.సిపియం అభ్యర్థి ప్రకటనకు ముందు తోటి వామపక్షాలతో సిపియం సంప్రదించింది లేనిది తెలియదు.సంప్రదించకపోతే నిర్ణయం ఏకపక్ష మౌతుంది.సంప్రదించి ఉంటే తప్పిదం నుండి తప్పించుకోగలుగుతుంది.మళ్ళీ కమ్యూనిస్టు పార్టీలు ఎవరికి వారు అవసరానికి ఇట్లాంటి రాజకీయ ముఖచిత్రంలో అవకాశవాద బాటలెంచుకుంటుంటే! వామపక్ష రాజకీయ ఐక్యత మాటల్లో తప్ప చేతల్లో ఆవగింజంత కనిపించడంలేదు,
కనీసం ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపి పోరాడలేని కమ్యూనిస్టు ఐక్యత మాటలకే తప్ప చేతల్లో మచ్చుకీ కనపడదు.అప్పుడప్పుడు ప్రజాసమస్యలపై కలిసి పనిచేసిన స్ఫూర్తి ని కూడా బూర్జువా పార్టీల కు దారాదత్తం చేయడానికి వెనకాడని అవకాశవాద నాయకత్వం ఇక్కడ ఉంది.కమ్యూనిస్టులు కూడా వ్యక్తి గత స్వార్థం,లబ్ది ఆలోచనలు నుండి బయటపడటం వరకు కమ్యూనిస్టు ఐక్యత ఒక పగటి కల మాత్రమే.ఎర్రజెండాల ఐక్యత ఎవరికి వారు అవసరానికి మాట్లాడే అందమైన ఉపన్యాసం,నినాదం తప్ప ఆచరణలో ఆవగింజంత ముందుకు పోయినట్లు కనపడదు.
నిజంగా ఎర్రజెండాలు ఏకం అవుతాయా? వ్యక్తిగత ఎజెండాలు వదిలి ఉమ్మడి ఏజెండాకు జై కొడతాయా? కమ్యూనిస్టు ఐక్యత మాటలేగాని,చేతలు దాటవా? ఇట్లాంటి ప్రశ్నలు కమ్యూనిస్టు శ్రేణులను ముంచెత్తడమే కాదు! ఐక్యత చర్చలపై నీలినీడలు పరుచుకుంటాయి.ఇప్పటికైనా “సిద్దాంతం లేని ఆచరణ గుడ్డిది.ఆచరణలేని సిద్దాంతం ఎడ్డెది”అన్న మార్క్సిస్టు మహోపాద్యాయుల మాటలు అక్షర సత్యాలు.ఐక్యతా దిశగా ప్రయాణం అంటే అలసిపోయిన కాడిని భాగస్వామ్యం భారంతో మోయడం.పరస్పరం గౌరవించుకోవడం,నమ్మకాలను అమ్మకాలతో ముడిపెట్ట కుండా నీతి,నియమాలతో బ్రతకడం.ప్రజల కోసం త్యాగాలు రహదారులు నిర్మించడం.కార్మికవర్గ దృక్పథం బలోపేతం చేయడం.ఎర్రజెండాల సమూహం స్వప్న కాంక్షలను నిజం చేయడం.ఆదిశగా అడుగులు పడాలి తప్ప తడబాటు యడబాటుకు దగ్గర మార్గం కారాదు. ఐక్యతా పాఠాలు,గుణపాఠాలు కామ్రెడ్ లకు కొత్తేమీ కాదు? చంద్రకుమార్ స్వప్న మే ఆచరణకు అంతుచిక్కనంత విశాల మైనది.వివాదస్పదమైనది.వేచి చూద్దాం ఐక్యతా దిక్చూచి తో ఎర్రజెండాల నావ ఏతీరం ఎలా చేరుతుందో!?-





