– సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్‌తో అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి బృందం భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : కీలక ఖనిజ రంగంలో సాంకేతిక, ఉమ్మడి భాగస్వామ్యం, తదితర అంశాలపై హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్‌కు చెందిన పొలిటికల్, ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ సారథ్యంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థతో పలు వ్యాపార సంబంధ అంశాలు, అవకాశాలపై ఇరు పక్షాల వారు సుదీర్ఘంగా చర్చించారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం గల సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించిందని, ఇప్పటికే పలు దేశాలతో ఉమ్మడి భాగస్వామ్యం, సాంకేతిక సహకారంపై చర్చిస్తోందని సీఎండీ వివరించారు. దీనిపై అమెరికన్ బృందం స్పందిస్తూ తమ దేశంలో కీలక ఖనిజ రంగంలో ఉన్న పలు సంస్థలతో కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని వివరించారు. సింగరేణి సంస్థ ఇటీవల కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్ లేబొరేటరీలో ఉన్న సౌకర్యాలు, ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్‌లో దాగి ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి అంశాలపై కూడా అమెరికన్ బృందం ఆసక్తి చూపింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, సహకారంతో సింగరేణి కీలక ఖనిజ రంగంలో ముందుకువెళ్తోందని సీఎండీ పేర్కొన్నారు. కీలక ఖనిజ రంగంలో విదేశీ పెట్టుబడులను, సాంకేతిక,పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని సంస్థ కోరుతోందని వివరించారు. అమెరికాలో పలు సంస్థలు ఇటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాయని కాన్సులేట్ సభ్యులు తెలిపారు. వచ్చే ఏప్రిల్‌లో అమెరికాలో జరిగే కీలక ఖనిజ సదస్సులో పాల్గొనవలసిందిగా సింగరేణిని ఆహ్వానించారు. నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను శోధిస్తున్నామని, తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో కూడా వీటి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని అమెరికన్ ప్రతినిధులు తెలిపారు. మూతపడిన ఓసీ గనులను సద్వినియోగం చేసేందుకు సింగరేణి పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, డాటా సెంటర్లకు పీక్ అవర్స్‌లో నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయని సింగరేణి అధికారులు వివరించారు. తగిన పెట్టుబడి, భాగస్వామ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే సమీపంలో గోదావరి నది నుండి కూడా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు అమెరికన్ కంపెనీలు డాటా సెంటర్లు ఏర్పాటు చేశాయని, మరికొన్ని కంపెనీలు కూడా వీటి ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలు వీటి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు అమెరికన్ కాన్సులేట్ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా సీఎండీ అమెరికన్ బృందాన్ని సింగరేణి గనులను, జియో సైన్స్ ల్యాబ్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. సమావేశంలో అమెరికన్ కాన్సులేట్ బృందానికి చెందిన పొలిటికల్, ఎకనామిక్ స్పెషలిస్ట్‌లు శ్రీమలి కరి, శిబా త్రిపాఠి, కమర్షియల్ స్పెషలిస్ట్ సునేల్ కుమ్మర్, సింగరేణి తరఫున డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు, జీఎం(మార్కెటింగ్, కోఆర్డినేషన్) టి.శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్) కె.రామదాసు, జీఎం(ఎక్స్‌ప్లోరేషన్) పంకజ్ కులశ్రేష్ట, జనరల్ మేనేజర్ (పవర్ ప్రాజెక్ట్స్) గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





