– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : ప్రభుత్వోద్యోగం చేయాలనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తమ స్వప్నాన్ని సాధించే దిశగా వారి ప్రయత్నాలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్స్‌లో పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న వారికి అందించే స్టైపెండ్ మొత్తాన్ని పెంచామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఆర్థిక చేయూత అనిపేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్స్‌ను నిర్వహిస్తున్నామని, వీటి ద్వారా ఏటా ఔత్సాహిక యువతీయువకులకు మెరిట్ ప్రాతిపదికన పోటీ పరీక్షలకు సంబంధించిన ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నామని, వీటిల్లో కోచింగ్ తీసుకుంటున్న యువతకు ప్రభుత్వపరంగా అందజేసే స్టైపెండ్‌ను గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచామని, ఇది నిరుద్యోగ యువతకు ఆర్ధికపరమైన వెసులుబాటు అని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యువత తమ కలల్ని నిజం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సివిల్స్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన యువతకు నెలవారీ స్టైపెండ్‌ను ప్రస్తుతం ఉన్న రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెంచామని, బుక్ ఫండ్ పేరిట యేటా ఒకసారి ఇస్తున్న మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని, టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, 2, 3, 4, బ్యాంకింగ్ సర్వీస్, రైల్వే రిక్రూట్మెంట్, స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలకు ఉద్దేశించిన ఫౌండేషన్ కోర్సులో కోచింగ్ తీసుకుంటున్ననిరుద్యోగ యువతకు ఇప్పటివరకూ ఇస్తున్న స్టైపెండ్ నెలకు రూ.1000ను రూ.1500లకు ఈ నెల నుంచి పెంచామని వివరించారు. సివిల్ సర్వీసు పరీక్షలలో విజయానికి నిరంతర అధ్యయనం, కొన్నేళ్ల నిరంతర సాధన అవసరమని, అందుకే చరిత్రలో మొదటిసారిగా గత రెండేళ్లలో బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు మరింత పటిష్టమైన ప్రిపరేషన్ అందించేందుకు తాజా అభ్యర్థులతో సమానమైన స్టైపెండ్‌ను ఇస్తూ మళ్ళీ ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. ఇందు కోసం వారికి యూపీఎస్సీ తరహాలో స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించి ఎంపిక చేస్తామని, ఇది పేద, బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ధైర్యాన్ని ఇస్తుందని ఆయన వివరించారు. బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్న వారిలో సివిల్ సర్వీసెస్ సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై ఇటీవల నిపుణుల కమిటీని నియమించామని, ఆ కమిటీ ఎన్నో సూచనలు చేసిందని, వాటిలో ప్రధానమైన స్టైపెండ్ పెంపుదలను తక్షణమే అమలు చేశామని, కమిటీ సూచనలన్నిటినీ పరిశీలించామని, వాటన్నిటినీ అమలు చేసే దిశగా ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ప్రతి స్టడీ సర్కిల్ భవనంలోని గోడలపై పోటీ పరీక్షలకు సంబంధించిన విజ్ఞాన విషయాలను, గ్రాఫ్‌లు, మ్యాప్‌లను పెయింటింగ్ వేయాలని, హైదరాబాదు బీసీ స్టడీ సర్కిల్లో మెట్లు, గోడలపై పోటీ పరీక్షల్లో సాధారణంగా అడిగే చరిత్ర, జాగ్రఫీ, భారత రాజ్యాంగం, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో విశేషాలనిను పెయింటింగ్ రూపంలో గోడలపై ముస్తాబు చేశారని తెలిపారు. దీనివల్ల తరగతి గదిలో లేని ఇతర సమయాల్లో కూడా ఆ పరిసరాల్లో ఉండే ఈ విజ్ఞానపరమైన అంశాలను చూడటం ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని ఆర్జిస్తారని, మరింత గుర్తుపెట్టుకుంటారని, ఇలా గోడలు కూడా జ్ఞానాన్ని బోధించే తరహాలో రూపొందించిన విధానాన్ని ఆయన ప్రశంసించారు. ప్రతి బీసీ స్టడీ సర్కిల్ సొంత భవనాలలో స్టడీ రూమ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కమిషనర్ బాల మాయాదేవి, బీసీ¾ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





