శంకర్ వైద్య ఖర్చులు నేనే భరిస్తా

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– కిమ్స్ లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురై కిమ్స్ సికింద్రాబాద్లో చికిత్స పొందుతున్న మెదక్ టౌన్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. శంకర్ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని శంకర్ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. శంకర్ ఆరోగ్య పరిస్థితి, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న కేటీఆర్ మానవతా దృక్పథంతో స్పందించారు. ‘శంకర్ వైద్య ఖర్చులను నేను వ్యక్తిగతంగా చూసుకుంటాను’. ఆయన తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు మనం కుటుంబానికి అండగా ఉన్నామని వారికి తెలియజేయండి’ అని ప్రవీణ్ కుమార్ కు చెప్పారు.
శంకర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధువులు, స్నేహితులు, సహచర పోలీసులు కలిసి ఇప్పటివరకు సుమారు రూ.1.5 లక్షలు సమకూర్చి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న శంకర్కు మరోసారి భారీగా వైద్య ఖర్చులు అవసరం కావడంతో సహచర పోలీసులు ఒక్కొక్కరు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. శంకర్ దయనీయ పరిస్థితిని చూసి బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్ విధి నిర్వహణలోనే తీవ్ర అనారోగ్యానికి గురైనా, అత్యవసర సమయంలో ఈహెచ్ఎస్ ద్వారా తక్షణ వైద్య సహాయం అందకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2013 నుంచి హోంగార్డుగా పనిచేసిన శంకర్ 2024 తర్వాత కానిస్టేబుల్ గా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల విధి నిర్వహణలో ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలారు. బ్రెయిన్ స్ట్రోక్ గా నిర్ధారణ కావడంతో మొదట వెల్నెస్ ఆసుపత్రికి, అనంతరం నిమ్స్ కు తరలించారు. బెడ్లు అందుబాటులో లేకపోవడంతో యశోదకు తీసుకెళ్లగా ఈహెచ్ఎస్ పై సమస్య తలెత్తిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు కిమ్స్ సికింద్రాబాద్ లో చికిత్స ప్రారంభించారు.

కేటీఆర్ స్పందించే వరకు ఎందుకు పట్టించుకోలేదు?

శంకర్ కుటుంబం ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈహెచ్ఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు తగిన విధంగా స్పందించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరఫున ఈ అంశాన్ని ప్రశ్నించిన తర్వాతే ఈహెచ్ఎస్ అధికారులు స్పందించి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పోలీసులు, ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్యంలో భరోసా కల్పించాల్సిన ఈహెచ్ఎస్ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *