హెల్త్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా తెలంగాణ

– టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
– హోమా సీఎంఈ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు, స్టార్టప్‌ల సామర్థ్యాలను హెల్త్ కేర్‌తో సమర్థవంతంగా అనుసంధానం చేసే కాంప్రహెన్సివ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీ-హబ్‌లో ‘బయాండ్ నంబర్స్- ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర’ అంశంపై ‘హోమా సీఎంఈ 2026’ పేరిట నిర్వహించిన జాతీయ సదస్సును ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మెడిసిన్‌ను టెక్నాలజీతో మిళితం చేస్తున్నామన్నారు. మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. వీటిని కేవలం సాంప్రదాయ వైద్య విధానాలతోనే కాక లైఫ్ స్టైల్ డేటాను విశ్లేషించడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశముందన్నారు. ఈ తరహా దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించాల్సిన అవసరముందన్నారు. ఆ దిశగా మరిన్ని నూతన ఆవిష్కరణలు రావాలన్నారు. రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే కొత్త ఆలోచనలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు భరోసానిచ్చారు. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వైద్య నిపుణులు, పరిశోధకులు, సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు ముద్దు సురేంద్ర నెహ్రూ రచించిన ‘ది న్యూ పారాడైమ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రపంచంలోనే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్ ప్లోరర’ను ప్రారంభించారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(పీవోసీ) పేరిట ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి ఎంపిక చేసిన 50మంది రోగులకు ఉచిత ప్రొటోకాల్‌ను అందించే కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *