ఎర్రవల్లిలో కొన‌సాగిన భూ సర్వే

– పాస్ పుస్త‌కాలు, నోటీసులతో రైతుల హాజరు
– సర్వే నంబర్ 325లో కొనసాగుతున్న సమగ్ర భూ కొలతలు
– పాండురంగ చెరువు నిర్మాణంతో భూమి కోల్పోయామంటున్న బాధితులు
– న్యాయం చేయాలని వేడుకోలు
– క్షేత్రస్థాయిలో పరిశీలించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శమీనా బేగం

మర్కుక్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో సర్వే నంబర్ 325లో గల 388.05 గుంటల ప్రభుత్వ భూమిపై చేపట్టిన సమగ్ర భూ సర్వే సోమవారం కూడా కొనసాగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఎర్రవల్లి గ్రామంలో సర్వే నంబర్ 325లో సాగు చేస్తున్న వంద మంది రైతులకు తొలి విడత నోటీసులు జారీ చేసి,సోమవారం తమ భూముల హద్దులు చూపించాలని ఆదేశించడంతో రైతులు ఉదయం నుంచే తమ పట్టాదార్ పాస్ బుక్ లు నోటీసులు,ఇతర రెవెన్యూ రికార్డులతో తమ భూముల వద్దకు చేరుకున్నారు.ఏడీ సుదర్శన్ రాథోడ్,డీఐ సేవ్య నాయక్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడిన సర్వే అధికారులు రైతులు చూపిస్తున్న హద్దుల ప్రకారం,రెవెన్యూ రికార్డుల ప్రకారం కొలతలు చేపట్టి వివరాలను నమోదు చేశారు.సోమవారం నాటికి సుమారు 70ఎకరాల వరకు సర్వే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.ఎర్రవల్లి గ్రామంలో కొనసాగుతున్న సర్వేను రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శమీనా బేగం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె సర్వే పనులు జరుగుతున్న తీరును,భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితమైన కొలతలతో,పారదర్శకంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని,అందరికీ న్యాయం జరిగేలా సర్వే చేయాలని ఆమె ఆదేశించారు.అలాగే సోమవారం రోజున మరో 50 మంది రైతులకు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా ఈ భూమికి హద్దులు ఏర్పాటు చేస్తున్న అధికారులు ప్రస్తుతం ఎవరి భూమి ఎంత ఉంది, ఎంత ఆక్రమణలో ఉంది..  ఎంత ఖాలీగా ఉంది అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు.

మా భూమి అంతా పాండురంగ చెరువులో పోయింది   
కాగా, ఈ సర్వేలో రైతుల ఆవేదన కూడా బయటపడింది. ఇదే సర్వే నంబర్ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పాండురంగ చెరువును నిర్మించారని, ఆ చెరువు నిర్మాణంలో రైతులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దాదాపు 80 ఎకరాల సాగు భూమి పూర్తిగా కోల్పోయామని రైతులు వాపోతున్నారు. త‌ద్వారా పండించుకునే భూమే లేకుండా పోయిందని.. ఇప్పుడు అదే భూములకు తమకు నోటీసులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ‘మా భూమి అంతా పాండురంగ చెరువులో పోయింది.. ఇప్పుడు మాకు నోటీసులు వచ్చాయి.. భూమే లేనప్పుడు మేము అధికారులకు ఏ భూమి చూపించాలం’టూ కొంతమంది రైతులు అధికారులను, సర్వేయర్లను ప్రశ్నిస్తున్నారు. శనివారం నోటీసులు అందుకుని సోమవారం పొలాల వద్దకు వచ్చిన రైతులు తమ భూములు చెరువు నీటిలో కలిసిపోయాయని, చూపించడానికి తమ వద్ద భూమే లేదని కన్నీటితో సమాధానమిచ్చారు. పాండురంగ చెరువు నిర్మాణంతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని, తమ భూములకు సరైన పరిహారం కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ భూమిని చూపించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్వే పూర్తయ్యాక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి తదుపరి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *