పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ

-క్లీన్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– హైటెక్స్‌లో ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో’

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని, క్లీన్ ఎనర్జీ రంగానికి నిలయంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్, నోవాటెల్‌లో రెండు రోజులపాటు జరగనున్న ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో-2026’ను మంగళవారం ఆయన ప్రారంభించారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈవోలు.. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, రండి.. తెలంగాణ అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే రాష్ట్రం.. ఇది పెట్టుబడిదారులకు ఒక స్వర్గధామం. మన సమృద్ధిని పంచుకోవడానికి, కలిసి ఎదగడానికి మిమ్మల్ని పూర్ణహృదయంతో ఆహ్వానించడానికి ఈ రాష్ట్రం సిద్ధంగా ఉంది’ అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో మార్పు అనేది విద్యుత్ ఉత్పత్తి మూలాన్ని మార్చడం మాత్రమే కాదని, అది సమగ్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్నే మార్చే విప్లవాత్మక ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. తెలంగాణను కేవలం స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రంగా మాత్రమే కాక ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగానికి అవసరమైన సాంకేతికతలను తయారు చేసే ప్రధాన కేంద్రంగా నిలపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూనే పర్యావరణ పరిరక్షణను సాధించేలా ప్రణాళికలు రూపొందించామని డిప్యూటీ సీఎం వివరించారు. ఇందులో భాగంగా 2030 నాటికి 20వేల మెగావాట్లు, 2035 నాటికి 26వేల మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. అలాగే పునరుత్పాదక ఇంధనానికి అత్యంత కీలకమైన విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని కూడా భారీగా విస్తరిస్తున్నామని చెప్పారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8వేల మెగావాట్ల నిల్వ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ, ఏఐ నైపుణ్యాలను ఉపయోగించి భవిష్యత్తు విద్యుత్ గ్రిడ్‌ను డిజిటల్ నెట్‌వర్క్‌గా మారుస్తున్నామని అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్ కోసం ప్రత్యేకంగా వంద మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ను అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు 2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, 2035 నాటికి 12వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సోలార్, విండ్, బ్యాటరీ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేసే కంపెనీలకు మూలధన సాయం, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, విద్యుత్ సుంకం మినహాయింపులతోపాటు టీజీ-ఐపాస్ ద్వారా వేగవంతమైన అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ఈ ఇంధన విప్లవం సాధ్యమవుతుందని, తెలంగాణతో కలిసి నడవాలని పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *