– ఏజెన్సీ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు లీడ్ తీసుకోవాలి
– అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం
– ఏజెన్సీ ప్రాంత మహిళా సర్పంచుల శిక్షణలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : ఏజెన్సీ ప్రాంతాలను దేశానికే ఆదర్శంగా నిలిచే గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వం వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏజెన్సీ ప్రాంత మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘పెసా’ చట్టం, గ్రామ సభల ప్రాధాన్యత, సర్పంచుల విధులు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై సర్పంచులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సాధారణ గ్రామ పంచాయతీలకు, షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయతీలకు చాలా తేడా ఉంటుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులు, అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాల్సిన అవసరం ఉందన్నారు. ‘పెసా’ చట్టం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలు కల్పించారని, వాటిని సర్పంచులు పూర్తిగా అర్థం చేసుకుని ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. అడవులను, ప్రకృతిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీలకు వారి హక్కులపై పూర్తి అవగాహన ఉండాలని మంత్రి అన్నారు. గ్రామ సభ నిర్ణయాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గ్రామానికి సంబంధించిన అభివృద్ధి, వనరుల వినియోగం వంటి అంశాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. ‘మీరు కేవలం సర్పంచులుగా కాక మీ గ్రామాల మార్గదర్శకులుగా నిలవాలి.. ఐదేళ్ల పదవీ కాలాన్ని ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకొచ్చే అవకాశంగా భావించాలి అని సూచించారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, ప్రజలకు ఆదాయం పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగడం, పిల్లలు చదువుకోవడం, ఆరోగ్యం మెరుగుపడటం, మహిళలు ఆర్థికంగా ఎదగడం కూడా అభివృద్ధిలో భాగమేనని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం పెంచేందుకు ఉపాధి హామీ కార్యక్రమాలను అనుసంధానం చేసుకోవాలని మంత్రి సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను గుర్తించి ప్రజలకు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభలను కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాక సామాజిక మార్పునకు వేదికలుగా ఉపయోగించుకోవాలని సీతక్క అన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం, మహిళలపై వేధింపులు లేకుండా చూడటం, పిల్లల విద్యను ప్రోత్సహించడం, పోషకాహారం, ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామ సభల్లో చర్చించి ప్రజలతో సామూహిక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఒక గ్రామ సభలోనే మన గ్రామంలో ఇకపై ఒక్క బాల్య వివాహం కూడా జరగకూడదని తీర్మానం చేసుకోవచ్చు. మహిళలకు ఎలాంటి వేధింపులు ఉండకూడదని నిర్ణయించుకోవచ్చు అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీతక్క కోరారు. ఇప్పపువ్వు లడ్డూ, మిల్లెట్ బిస్కెట్లు వంటి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ ఆహారంతో పాటు మహిళలకు, స్థానిక కుటుంబాలకు ఆదాయ మార్గాలు కల్పించవచ్చని చెప్పారు. ఆరోగ్యం ప్రకృతితో ముడిపడి ఉండేలా సంప్రదాయ ఆహార విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. రాజకీయాలకతీతంగా పాలన సాగించాలని, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సర్పంచులకు మంత్రి సూచించారు. ప్రజల కష్టాలను గుర్తించి, అత్యవసర పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం సర్పంచుల విజయానికి ముఖ్యమైన అంశమని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల మహిళా సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి ఆకాంక్షించారు. మంచి పనితీరుతో గ్రామాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయస్థాయిలో కూడా గుర్తింపు, పురస్కారాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ మూడు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి సర్పంచ్ తన గ్రామానికి ఏం చేయాలనే దానిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. నేర్చుకోవడం, గతంలో చేసిన పనులను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం ఈ శిక్షణ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్డి డీజీ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, శిక్షణ కార్యక్రమ కోఆర్డినేటర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్కను శాంతికుమారి సన్మానించారు. మంత్రితో మహిళా సర్పంచులు గ్రూప్ ఫొటో దిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



