ఉపాధ్యాయులు శిల్పులు

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ఒక మంచి ఉపాధ్యాయుడు వందలాది జీవితాలను వెలిగించే దీపం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదని, ఒక తరాన్ని తీర్చిదిద్దే శిల్పి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు బిడ్డకు జన్మనిస్తే ఉపాధ్యాయులు ఆ బిడ్డ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తారని మంత్రి అన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు అందించే జ్ఞానం, చూపించే మార్గం, ఇచ్చే ప్రోత్సాహం విద్యార్థి జీవితంపై చెరగని ముద్ర వేస్తాయని తెలిపారు. సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో నిపుణులుగా ఎదిగిన ప్రతి ఒక్కరి వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి ఉంటుందని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రకు ఇస్తున్న గౌరవానికి ప్రతీక అని మంత్రి అన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తేవచ్చని, పేదరికం, వెనుకబాటుతనం, సామాజిక అసమానతలను అధిగమించడానికి విద్యే అత్యంత శక్తివంతమైన సాధనమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ విద్యార్థులకు విద్యనందిస్తున్నారని ప్రశంసించారు. వారు పిల్లలకు పాఠ్యాంశాల బోధనతోపాటు ఆత్మవిశ్వాసం, ఆశయం, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతను నేర్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతేనే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు సమానావకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ విద్యకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, డైట్, కాస్మెటిక్ చార్జీలు విద్యార్థులకు పెంచడంతోపాటు ముఖ్యమంత్రి ముందు చూపుతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నారని వివరించారు. ప్రతి బిడ్డలో ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *