రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 20 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, బాలురు–బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి కనీస సౌకర్యాల లేమిపై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవాలని పోస్టుకార్డులు/లేఖల ద్వారా విజ్ఞప్తి చేయడం రాష్ట్ర విద్యావ్యవస్థలోని లోపాలను, విద్యార్థుల ఆవేదనను స్పష్టం చేస్తున్నది . ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంపై విద్యార్థులు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఒక సంచలనం. పౌర సంఘాలు కూడా ఈ సమస్యను స్యూమోటో పిల్‌గా పరిగణించాలని కోరుతున్నాయి.
విద్యార్థులే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్రమైన హెచ్చరిక. మరింత ముఖ్యంగా, తెలంగాణ ప్రభుత్వం తన విజన్-47 పత్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చేయడం వంటి స్పష్టమైన లక్ష్యాలను ప్రకటించింది. ప్రస్తుత ఫిర్యాదులు ఆ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21ఎ ప్రకారం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు కేవలం పాఠశాల భవనానికే పరిమితం కాదు. గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించడం కూడా అందులో భాగమే. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు లేకపోవడం విద్యార్థుల మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది.
తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. సిలబస్ పూర్తి కాక విద్యార్థులు నష్టపోతున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ముఖ్యంగా హైస్కూల్ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వారి హాజరు శాతం తగ్గడానికి, డ్రాపౌట్స్ పెరగడానికి దారితీస్తున్నది . కేవలం పుస్తక పఠనమే కాకుండా ప్రాక్టికల్ విజ్ఞానం అందించే ల్యాబ్‌లు, లైబ్రరీలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు.
ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పనపై పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. విద్యా రంగానికి తగినంత బడ్జెట్ కేటాయించకపోవడం, కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ లోపించడం, స్థానిక అధికారుల ఉదాసీనత కూడా ఈ సమస్యకు ప్రధాన కారణాలు. గతంలో కూడా పాఠశాలల్లో మౌలిక వసతులపై కోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినయ్. ఇప్పుడు 20వేల మంది విద్యార్థుల లేఖలను సుమోటోగా స్వీకరించి హైకోర్టు విచారణ జరిపితే, అది విద్యా వ్యవస్థలో పెద్ద మార్పుకు కారణం కావొచ్చు. విద్యార్థుల విజ్ఞప్తిపై కోర్టు స్పందించి ప్రభుత్వానికి గడువు విధించడం ద్వారా తక్షణ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావొచ్చు.
భారతదేశంలో విద్యా హక్కు చట్టం ఒక బలమైన చట్టంగా మారడానికి , పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తప్పనిసరి కావడానికి సుప్రీంకోర్టు , వివిధ హైకోర్టులు ఇచ్చిన పలు కీలక తీర్పులే ప్రధాన కారణం.మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం (1992) కేసులో సుప్రీంకోర్టు “విద్యా హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) లో ఒక భాగం” అని మొట్టమొదటిసారిగా ప్రకటించింది. విద్య లేకపోతే మనిషి గౌరవంగా జీవించలేడని, అందువల్ల విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (1993) కేసులో మోహిని జైన్ తీర్పును మరింత స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను పొందడం వారి ప్రాథమిక హక్కు అని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ఆధారంగానే తదుపరి కాలంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 21ఎ ను చేర్చారు, ఆ తర్వాతే యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ , ప్రధాన మంత్రి డా మన్మోహన్ సింగ్ హయాంలో ‘విద్యా హక్కు చట్టం-2009′ రూపుదాల్చింది.
ఎన్విరాన్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2012) కేసులో సుప్రీంకోర్టు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తాగునీరు , బాలురు-బాలికలకు వేర్వేరుగా పరిశుభ్రమైన మరుగుదొడ్ల వసతిని ఆరు నెలల్లోగా కల్పించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. కనీస వసతులు లేని పాఠశాలలు విద్యా హక్కును ఉల్లంఘిస్తున్నట్లేనని కోర్టు పేర్కొంది. తెలంగాణ విద్యార్థులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకు (మరుగుదొడ్లు, తాగునీరు లేకపోవడం) ఈ తీర్పు నేరుగా వర్తిస్తుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తాగునీరు , బాలురు-బాలికలకు వేర్వేరుగా పరిశుభ్రమైన మరుగుదొడ్ల వసతిని ఆరు నెలల్లోగా కల్పించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
కనీస వసతులు లేని పాఠశాలలు విద్యా హక్కును ఉల్లంఘిస్తున్నట్లేనని కోర్టు పేర్కొంది. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కేవలం భవనాలు నిర్మిస్తే సరిపోదు; అందులో కనీస అవసరాలు ఉండాలి .ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఖాలీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి.ప్రతి పాఠశాలలో రక్షిత తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ ఆర్) నిధులను ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ఉపయోగించాలి. విద్యార్థులు కలం పట్టి పాఠాలు రాయాల్సిన చోట, తమ హక్కుల కోసం కోర్టుకు లేఖలు రాయడం పాలకుల కళ్లు తెరిపించాలి . ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి శాశ్వత ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





