ఖాలీలను పూరింపుము

“మనం మన దేశాన్ని విద్యావంతమైన రాజ్యంగా కాకుండా పోలీసు రాజ్యంగా మార్చదలుస్తున్నామా? ప్రైవేటు స్కూల్స్ పుట్టుగొడుగుల్లా పుట్టుకొని వస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ హయాంలో దాదాపు ఒక లక్ష ప్రభుత్వ బడులను మూసివేశారు. విద్యార్థులను ప్రైవేటు బడులకు తోలటానికి ఇదో రహస్య, అదృశ్య ఎజెండా. నిజానికి ప్రభుత్వ బడుల్లోని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లోకి పంపటానికి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన, బహిరంగ ఎజెండాను మొదలుపెట్టింది..”

-ఆమీర్ మాలిక్, న్యూ దిల్లీ జర్నలిస్ట్

“7993 బడుల్లో, 20817 మంది టీచర్లకు బోధించటానికి ఒక్క విద్యార్థి కూడా లేడని పాఠశాల విద్యమీద నీతీ (NITI) అయోగ్ రిపోర్టు తెలియచేస్తుంది. ఇంకోవైపు విద్యార్థులకు 6,23,964 మంది టీచర్ల కొరత వుంది. దీనికర్థం ఆ పోస్టులు ఎన్నటికీ భర్తీ కావని.”

మన కడుపులు కాలినా, విద్య ద్వారా మన ఆలోచనాక్రమాన్ని పదును పెట్టుకొంటున్నాము. ‘తినటానికి సగం రొట్టె వున్నా, అదే తింటాం. కానీ బడికి మాత్రం పోతాం’ అనే మాటను మనం స్ఫూర్తిగా తీసుకొంటాము. ఈ నానుడిని మనం స్కూలుకి వెళ్లే రోజుల నుండి నేర్చుకొంటున్నాం. స్పష్టంగా విద్యకే ప్రాముఖ్యం ఇచ్చాము. ఆకలి అనేది  ప్రధానమైన ప్రతిబంధకం అయినప్పకీ అది ఎన్నటికీ అడ్డంకి కాదు. ఆ మాటతో స్ఫూర్తి పొందిన మనం, విద్యకు ఇప్పటికీ ఎంతో సమున్నతమైన స్థానం ఇస్తాము.   

టీచర్లు ఎప్పుడూ మనల్ని ‘మీరు బ్రేక్ ఫాస్ట్ తినటం మర్చిపోయారా?’ అని అడగరు. మనలో చాలామందికి అది వుండదని వాళ్లకు తెలుసు. ఇదో కొత్త పరిణామం. ఏ విద్యార్థినైనా ‘మీరు బ్రేక్ ఫాస్ట్ తినటం మర్చిపోయారా?’ అనే ప్రశ్నను ఎవరైనా అడిగారంటే వాళ్లు చాలా అదృష్టవంతులనుకోవాలి. వాళ్లకు ఉపాధ్యాయులున్నారని అర్థం. కానీ ఒకప్పుడు ఈ దేశంలో టీచర్లు తక్కువగా వుండేవాళ్లు. ఇప్పటి కొత్త పరిణామం ఏమిటంటే విద్యార్థులే ఇప్పుడు బడులకు రాలేకపోతున్నారు. పిల్లలు ఇళ్ల నుండి బడికి వస్తున్నపుడే డ్రాప్ ఔట్ జరుగుతుంది. వాళ్లు బడి మానేసి పనిచేయటం మొదలుపెడతారు. దేశంలో 7,993 బడుల్లో చదువుకోవటానికి ఎవరూ రావటం లేదని ‘భారతదేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ’ అనే నీతి అయోగ్ నివేదిక తెలియచేసింది.   

2024-25 సంవత్సరాలలో పైన చెప్పిన పాఠశాలల్లో ఎవరూ చేరలేదు. ఈ స్కూల్స్ లో 20817 మంది ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వ బడులను ప్రైవేట్ వారి చేతుల్లో పెట్టే ‌ఈ కుట్ర ఆగకుండా కొనసాగుతూనే వుంది. ఇలాంటి బడులు ఎక్కువ శాతం పశ్చిమ బెంగాల్ లోనూ, తెలంగాణలోనూ ఉన్నాయి. పై నివేదిక వచ్చే సమయానికి తెలంగాణా ప్రభుత్వం చంద్రశేఖర రావు నాయకత్వాన వుంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా వున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏలుతున్న మధ్యప్రదేశ్ కూడా చాలా వెనుకబడి వున్నది.  

ఎక్కడైనా పిల్లల్ని బడికి పంపే బాధ్యత ప్రభుత్వం మీదనే వుంటుంది. విద్యార్థులు విద్యా అనే పడవను తోలుకొంటూ ముందుకు వెళితే  -దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా, సౌభాగ్యవంతంగా ఉంటుంది. ఈ విషయంలో విఫలం చెందితే, పేదరికపు కోరల నుండి తప్పించుకొనే సువర్ణావకాశం ఊపిరి పోసుకోకముందే సమాధి అయిపోతుంది. అప్పుడిక ఉద్దేశపూర్వకంగానే కార్మికసైన్యం మెల్లిమెల్లిగా ఆవిర్భవిస్తుంది. దేశమంతా ఈ కార్మికులతో కాంక్రీటు అరణ్యాలు తయారవుతాయి. నగరాలు తయారవుతాయి. కానీ ఆ నగరాల్లో ఇదే కార్మికులు గౌరవప్రదంగా ఎన్నటికీ జీవించలేరు.  

ఈ దేశంలోనూ, ఇతర దేశాల్లో కూడా ఒక విద్యార్థి ఉన్నాకూడా స్కూలు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనే విషయం గురించి విన్నాము. ఏ విద్యార్థి రవీంద్రనాథ్ టాగూరు అవుతాడో, ఏ విద్యార్థి డా. భీమారావు అంబేద్కర్  అవుతాడో ఎవరికి తెలుసు? బడులు ఎప్పుడూ నడుస్తూనే వుండాలి. పిల్లలు వస్తూనే వుండాలి.  ఈ దేశపు ప్రతిపక్షం, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు -ఈ విషయాన్ని నొక్కి చెబుతారు. విద్యార్థుల గొంతుకలు ప్రతిధ్వనించాలని చెబుతారు. చదువుకోవటానికి వస్తే, వాళ్లు మాఫియాలతో తలబడనవసరం లేదు. వాళ్లు టీచర్లను కలుస్తారు.  విద్యార్థుల కష్టం గంగపాలు కాకూడదనే విషయాన్ని ఇది నొక్కి చెబ్తుంది.  

విద్యార్థులు అసలు హాజరు కాని బడులు ఈ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అస్సామ్, చండీఘర్, ఛత్తీస్ ఘర్, దాద్రా, నగర్ హవేలి, డామన్-డియో, దిల్లీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, లక్షద్వీప్, మహారాష్ట్ర, నాగాల్యాండ్, పుదుచెర్రి, సిక్కిం, త్రిపురలు వున్నాయి. ఈ ప్రాంతంల్లో ప్రతి బడికి కనీసం కొంతమంది విద్యార్థులు వున్నారు. మనం ఈ డాటాలోకి లోతుగా వెళితే, దేశవ్యాప్తంగా 1,04,125 బడుల్లో ఒకే ఒక టీచర్ వున్నారు. ఈ ఏకోపాధ్యాయ బడుల్లో 33,76, 769 మంది పిల్లలు చేరారు.  ఈ బడుల్లో 89%, అంటే 92,671 స్కూల్స్  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని UNESCO రిపోర్టు చెబుతోంది. దానికర్థం అక్కడ విద్యా వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగా వుందని.  

ఇప్పటికీ టీచర్ పోస్టులు ఖాలీగా ఉన్న బడుల సంఖ్య చెప్పటం కూడా ముఖ్యమైనదే. ఈ దేశంలో 6,23,964 మంది టీచర్ల కొరత వుంది. ఎక్కువ కొరత బుద్ధుడూ, ఆర్యభట్ట జన్మించిన బీహార్ లో వుంది. ఈ రాష్ట్రంలో ఏ రూపంలో అయితేనేమీ రెండు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో వుంది. ఇక్కడ 2,77,854 టీచర్ పోస్టులు ఖాలీగా వున్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్ లు కూడా టీచర్ పోస్టుల భర్తిలో వెనుకబడి వున్నాయి. దిల్లీ, కేరళా, నాగాల్యాండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఖాలీ  పోస్టులు లేవు. ఇంకోవైపు పంజాబ్ లో టీచర్ రిక్రూట్మెంట్ కాకుండా పోలీసు రిక్రూట్మెంటు జరుగుతోంది. డాటా ప్రకారం ఇక్కడ 6,423 ఖాలీ  పోస్టుల్లో టీచర్లను భర్తీ చేయాల్సి వుంది. ఎన్నో విశ్వవిద్యాలయాలు కోట్లాది అప్పుల భారంతో వున్నాయి. 

మనం మన దేశాన్ని విద్యావంతమైన రాజ్యంగా కాకుండా పోలీసు రాజ్యంగా మార్చదలుస్తున్నామా? ప్రైవేటు స్కూల్స్ పుట్టుగొడుగుల్లా పుట్టుకొని వస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ హయాంలో దాదాపు ఒక లక్ష ప్రభుత్వ బడులను మూసివేశారు. విద్యార్థులను ప్రైవేటు బడులకు తోలటానికి ఇదో రహస్య, అదృశ్య ఎజెండా. నిజానికి ప్రభుత్వ బడుల్లోని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లోకి పంపటానికి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన, బహిరంగ ఎజెండాను మొదలుపెట్టింది. హర్యానాల లాంటి రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ప్రభుత్వం రకరకాల ఎన్జీవోల ద్వారా వోచర్లు ఇవ్వటం మొదలు పెట్టింది. ఆ వోచర్లు తీసుకొని వాళ్లు ఏ ప్రైవేటు బడికైనా వెళ్లవచ్చు.  

ఈ పథకం అప్పుడు ఫెయిలు అయింది. కానీ పిల్లలు బడికెళ్లటం మొదలు పెట్టీ పెట్టగానే విద్యా మాఫియాలు లాభార్జన ధ్యేయంగా పని చేయటం మొదలుపెడతాయి. ప్రభుత్వ స్కూల్స్ లో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనాలలో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులను ప్రవేశపెట్ట దల్చుకొన్నదనేది అందరికీ తెలిసిన విషయమే. ‘ప్రభుత్వ విద్యను అందంగా దెబ్బతీశార’ని విద్యావేత్త రాంపాల్ అన్నారు. ఆకలితో, చెప్పులు లేకుండా, వరదల్లో, ఎండల్లో, చలికాలాల్లో బడికి వెళ్లినవారికి -ప్రభుత్వ విద్య అందంగానైతేనేమీ, అందవికారంగానైతేనేమీ దెబ్బతినటాన్ని చూడటం అంత సులభంగా అనిపించటం లేదు. ఈ అంతరాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రైవేటు వ్యక్తులది కాదు. ఆదాని మన ప్రధానమంత్రి కాదు. అంబానీ మన విద్యామంత్రి కాదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *