తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిర్మాణాలు

– సమగ్ర ప్రణాళికతో విమానాశ్రయాల పనులు చేపట్టాలి
– శాఖల మధ్య సమన్వయంతోనే పనులు వేగవంతం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, దిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం శిల్ప, వాస్తు కళను పరిశీలించి అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఆయా నిర్మాణాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహం మార్పు, రహదారుల మళ్లింపు, బీఎసఎనఎల్ లైన్లు, తాగు నీటి సరఫరా లైన్ల మార్పు అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. విమానాశ్రయాల ప్రహరీ సమీపం నుంచి రహదారులు నిర్మించాలని, ఆ రహదారులను సమీప జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని సూచించారు. ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా పనులు చేపడితే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. విద్యుత్, ఆరఅండ్‌బీ, తాగు నీటి సరఫరా, నీటిపారుదల శాఖ అధికారులు సమావేశమై బీఎసఎనఎల్ అధికారులతో చర్చించి ఏకకాలంలో పనులు సాగేలా చూడాలని సూచించారు. ప్రస్తుత అవసరాలనే కాక భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని పనులు ముందుకు సాగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే విమానాశ్రయాల ప్రాంగణం లేదా సమీపంలో చెరువులను నిర్మించి, అక్కడినుంచి ప్రవాహాలను మళ్లించేలా చూడాలన్నారు. విమానాశ్రయాలకు వచ్చే, వెళ్లే రహదారులు విశాలంగా ఉండడంతోపాటు సమీపంలోని ముఖ్య రహదారులకు అనుసంధానించేలా నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతోపాటు దిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి పలు మార్పులు సూచించారు. సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్, పవర్ గ్రిడ్ ఈడీ డొమన్ యాదవ్, టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎయిర్ కమోడొర్ రాహుల్ శుక్లా, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, స్థపతి ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *