ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు

– ట్రాఫిక్ శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌తో సైబరాబాద్ సీపీ 

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ (ఐపీఎస్) మంగళవారం సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారం రోజులపాటు నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న సిబ్బందితో సీపీ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ విధులను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, ట్రాఫిక్ నియంత్రణలో పాటించాల్సిన విధానాలు, చట్టపరమైన అంశాలపై సీపీ సూచనలు చేశారు. శిక్షణలో ట్రాఫిక్ నిర్వహణ,ట్రాఫిక్ ఇంజనీరింగ్, చట్టపరమైన విషయాలు తదితర అంశాలపై ఇండోర్ అవుట్‌డోర్ తరగతుల ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. హెల్మెట్ ధార‌ణ‌, లేన్ క్రమశిక్షణ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచాలని, ప్రమాదాల వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని గుర్తు చేశారు. ప్రతి సిబ్బంది ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై చైతన్యం కల్పించాలని ఆదేశించారు.ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అక్కడ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, ఎస్‌బీ డీసీపీ సుధీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రి రెడ్డి, సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు,ట్రాఫిక్ అడ్మిన్ ఏడీసీపీ నరేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *