టరాబాతో భాగస్వామ్యం మరింత బలోపేతం

– తెలంగాణ విత్తనరంగ అనుభవం నైజీరియాకు ఉపయోగపడాలి
– ఇక్కడ శిక్షణ పొందిన టరాబా రాష్ట్ర యువతకు సర్టిఫికెట్ల ప్రదానం
– అంతర్జాతీయ విత్తన విద్య, పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ ముగింపు కార్యక్రమం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఆ అనుభవాన్ని నైజీరియాలోని టరాబా రాష్ట్ర యువతతో పంచుకోవడం సంతోషకరమని అన్నారు. శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య, పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం బుధవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రాయోగిక పరిజ్ఞానం పొందారని తెలిపారు. టరాబా ప్రభుత్వం తమ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కల్పించేందుకు చూపుతున్న చొరవ అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా టరాబా రాష్ట్రంతో వ్యవసాయం, విత్తన సాంకేతికత, రైతు శిక్షణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ, టరాబా రాష్ట్రాల మధ్య ‘సిస్టర్ స్టేట’ భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఇది ఇరు ప్రాంతాల మధ్య పరస్పర అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాలలో రాష్ట్రం సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. టరాబా రాష్ట్ర యువత ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను తమ ప్రాంత అభివృద్ధికి వినియోగించి వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, టరాబా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అగ్బు కెఫాస్, టరాబా సీడ్స్ లిమిటెడ్, ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ప్రతినిధులు, శిక్షకులు, అధికారులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *