– జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సీఎస్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్య లు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులపాటు కురిసే అవకాశం ఉన్నందున చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పిలతో సీఎస్ సంజయ్ జాజు సచివాలయంలో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో డీజీపీ సి.వి.ఆనంద్, అడిషనల్ డీజీ భగవత్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి హరిచందన, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ ఈ రాత్రి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్నందున జిల్లాల్లో పోలీసు వివిధ శాఖలతో సమన్వయంతో తగు చర్యలు చేపట్టాల ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రధానంగా ఆయా జిల్లాలో వాటర్ ఫాల్స్, ప్రమాదకర ప్రదేశాలు ఉన్న పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఇప్పటికే, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని, అవసరమైనప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎల్ నినో ప్రభావం వల్ల సెప్టెంబర్ లోనూ వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నందున వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రధానంగా, కూరగాయలు పండిస్తే మార్కెట్ లో మంచి ధర ఉండడమే కాక హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా కూడా కొనుగోలు చేయించనున్నట్లు సి.ఎస్ చెప్పారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని, ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో249 ప్రమాదకర జలాశయాలున్న పిక్నిక్ స్పాట్స్ ను గుర్తించామని, మరో 167 పర్యాటక ప్రాంతాలను గుర్తించి భారీ వర్షాలు, వరదలున్న సమయంలో ఈ ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా పోలీస్ శాఖ తగు చర్యలు చేపట్టిందని డీజీపీ ఆనంద్ వెల్లడించారు. 12 కంపెనీల బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





