– రబీ ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే నెంబర్ 1
– కేంద్రం లక్ష్యాలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు
– ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్ర సృష్టించింది
– బీజేపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి
– పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుండగా కేంద్రం మాత్రం రాష్ట్రానికి కేటాయించే ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలతో కలిసి సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా సాగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్‌లు ఉద్దేశపూర్వకంగా రైతుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాల యాత్రల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆహార శాఖను, ఎఫ్‌సీఐ అధికారులను కోరినట్లు మంత్రి తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతుల అవసరాలను పక్కనబెట్టి పరిమిత లక్ష్యాలను విధించడం వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడిందన్నారు. అయితే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ రబీసీజన్‌లో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు. కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. ఈ కొనుగోళ్ల విలువ రూ.17,917 కోట్లకు చేరుకుందని, రైతులకు నేరుగా కనీస మద్దతు ధర చెల్లించామని తెలిపారు.
దేశ రబీ ధాన్యం కొనుగోళ్లలో 61 శాతం
దేశవ్యాప్తంగా జరుగుతున్న రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఒక్కటే 61 శాతం వాటా కలిగి ఉందని మంత్రి వెల్లడించారు. ఏపీ 25.03 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే తెలంగాణ 75 లక్షల టన్నులు కొనుగోలు చేసి దాదాపు మూడు రెట్లు అధికంగా సేకరించిందన్నారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో దేశంలో నంబర్-1 రాష్ట్రంగా నిలవడం రైతుల కృషి, ప్రభుత్వ సమర్థ ప్రణాళికల ఫలితమని పేర్కొన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి 2025-26లో రాష్ట్ర ప్రభుత్వం 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర చరిత్రలోనే కాక ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ అత్యున్నత రికార్డు నమోదు చేసిందన్నారు. మొత్తం 295 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిలో 147 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రైతులకు రూ.35,077 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించామని, 25.20 లక్షల రైతు లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యాయని వివరించారు. రైతు ఇంటి వద్దకే కొనుగోలు సేవలు అందించాలనే లక్ష్యంతో ఖరీఫ్‌లో 8,448 కొనుగోలు కేంద్రాలు, రబీలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న యÖపీలో 4,850 కేంద్రాలు మాత్రమే ఉండగా తెలంగాణలో వాటికంటే 1.7 రెట్లు ఎక్కువ కేంద్రాలు పనిచేశాయని చెప్పారు. గత రెడేళ్లల్లోనే మÖడు వేలకుపైగా కొత్త కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రబీ ధాన్యం ఉత్పత్తి 28 శాతం పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుంచి 52 లక్షల టన్నులకు తగ్గించిందని, ఈ నిర్ణయం వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత రెం&డేళ్లల్లో అదనంగా 57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.16,645 కోట్ల మద్దతు ధర చెల్లించిందని చెప్పారు. కొనుగోళ్ల కోసం మొత్తం 20.86 కోట్ల గన్నీ సంచులను సిద్ధం చేశామని, వాటిలో 18.75 కోట్ల సంచులను వినియోగించినప్పటికీ Ÿస్త్రుతం 2.11 కోట్ల సంచులు నిల్వలో ఉన్నాయని తెలిపారు. గన్నీ సంచుల కొరత లేదని స్పష్టం చేశారు.
తడిసిన ధాన్యాన్ని కూడా కొని ఆదుకున్నాం
అకాల వర్షాలతో తడిసిన 12,557 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రత్యేక చర్యల ద్వారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకున్నామని మంత్రి తెలిపారు. ఆ ధాన్యానికి 12 గంటల వ్యవధిలోనే మద్దతు ధర చెల్లించి రైతులను నష్టాల నుంచి కాపాడామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఐకేపీ, పీఏసీఎస్ తదితర సంస్థల ద్వారా 147 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, వారికి రూ.470.40 కోట్ల కమీషన్ లభించిందని వెల్లడించారు. రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు రాజకీయ ఆరోపణలు చేయడం మానుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





