రహదారుల మన్నికలో రాజీ పడొద్దు

– ప్ర‌తీ ఇంజినీర్ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి
– ఇంజినీర్లకు కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ చుర‌క‌లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 19: రహదారుల నిర్మాణాల్లో నాణ్యత, భద్రత, మన్నిక విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఇంజినీర్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పూర్తి బాధ్యత తీసుకుని సంపూర్ణంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్ సమావేశాన్ని నితిన్ గడ్కరీ జ్యోతిప్ర‌జ్వ‌ల‌న చేసి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణంలో చాలా రికార్డులు సాధించామని తెలిపారు. హైవేల నిర్మాణంలో ఇంజినీర్లు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. రోడ్ కనెక్టివిటీలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్‌గా ఉందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు మంచిగా ఉంటే భారీగా పెట్టుబడులు వస్తాయని వివరించారు. కాగా, దేశంలో జ‌రుగుతున్న‌ రోడ్డు ప్రమాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. ఈ మాటలు చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్పక తప్పని పరిస్థితి.. ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షల మంది చనిపోతున్నారు.. వారిలో ఎక్కువమంది యువకులే ఉంటున్నారు.. ఇకపై రోడ్లపై బ్లాక్ స్పాట్స్ కనిపించకూడదు. బ్లాక్‌స్పాట్ ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లదే అని గడ్కరీ స్ప‌ష్టం చేశారు. ఫ్లై ఓవర్ నిర్మించాల్సిన చోట నిర్మించం, అండర్‌పాస్ ఇవ్వాల్సినచోట ఇవ్వం, జంక్షన్ల గురించి పట్టించుకోం అని ఇంజినీర్లకు చురకలంటించారు. ఆ ప్రమాదాలకు మనమే బాధ్యులమని స్పష్టం చేశారు. దీనిపై మీలో కచ్చితంగా బాధ్యతాయుతమైన ధోరణి రావాలని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఐఆర్‌సీలోని ప్రతి ఇంజనీర్ నిబద్ధత, బాధ్యత, సహకారం తనకు కావాలని తెలిపారు. తెలంగాణ కోసం తన వంతుగా మీకు ఎంత సహాయం చేయగలనో అంత వరకు చేస్తానని రేవంత్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా గడ్కరీ భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *