రూ.2.5 కోట్లు మిడ్ మానేరు నీళ్లపాలు

– పర్యాటకులకు కరవైన బోటు షికారు
– ప‌ట్టించుకునేవారు లేక ఒడ్డునే ప‌డి ఉన్న బోటు
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: ‘నేను నీళ్లపై పరుగులు తీయాలని వచ్చాను.. పర్యాటకులను ఆనందింపజేయాలనుకున్నాను.. కానీ నేడు మోకాళ్ల లోతు నీళ్లలోనే నిలిచిపోయాను. నాపై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. నా ప్రయాణం మాత్రం కొన్ని అడుగులకే పరిమితమైంది. నన్ను నిరుపయోగంగా మార్చారు.. అలలను చీల్చాల్సిన నేను ధూళిని మోస్తూ నిలబడ్డాను.. ఇది మిడ్ మానేరు ఒడ్డున సేద తీరుతున్న ఓ బోటు కథ. అభివృద్ధి కలలకూ, నిర్లక్ష్య వాస్తవాలకూ మధ్య ఉన్న మౌన సాక్ష్యంగా మిగిలిన ఈ బోటు ‘ప్రజాతంత్ర’ కెమెరాకు చిక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దాదాపు రూ.2.5 కోట్లతో ఈ డబుల్ డెక్కర్ ఏసీ బోటును తీసుకొచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మిడ్ మానేరును రాష్ట్రస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతుందని అందరూ ఆశించారు.  అలలను చీల్చుకుంటూ వందలాదిమంది పర్యాటకులను తనపై తీసుకెళ్లాల్సిన ఈ బోటు నేడు మోకాళ్ల లోతు నీళ్లలో నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఒకప్పుడు ప్రారంభోత్సవ వేడుకలతో సందడి చేసిన ఈ బోటు ఇప్పుడు తనను చూసేవారి కోసం ఎదురు చూస్తోంది. పర్యాటక అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన ఈ బోటు ప్రస్తుతం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఈ ప్రాజెక్టు ఎందుకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.. పర్యాటకులను ఆకర్షించాల్సిన ఈ బోటు ఎందుకు ఒడ్డునే ఆగిపోయింది.. అభివృద్ధి కలలు ఎందుకు కల్లలయ్యాయి.. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలలపై హాయిగా విహరించాల్సిన బోటు.. ఆశలకు ప్రతీకగా నిలిచిన ఈ బోటు.. నేడు అసంపూర్తి కలలకు, వృథా అయిన ప్రజాధనానికి మౌన సాక్షిగా మిగిలిపోయింది.
———————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *