– రాష్ట్రాలతో సంప్రదించకుండా కొత్త పథకం ప్రారంభం సరికాదు
– ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకు వంద శాతం నిధులు భరించాలి
– తెలంగాణ ప్రతిపాదనలపై త్వరలో చర్చిస్తామన్న కేంద్ర మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: విబిజి రామ్-జీ పథకం అమలును వాయిదా వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి దనసరి అనసూయ సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా నూతన ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం సరికాదన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పనులు పూర్తయ్యే వరకు ఎంజీఎనఆరఈజీఏ పథకం ప్రకారమే వంద శాతం నిధులను కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంజీఎనఆరఈజీఏ స్థానంలో రానున్న వి.బి.జి. రామ్-జీ పథకానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను మంత్రి సీతక్క కేంద్రానికి తెలియజేశారు. ఎంజీఎనఆరఈజీఏ అమలులో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని, ప్రతి సంవత్సరం సగటున 12 కోట్ల పనిదినాలు కల్పిస్తూ గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో తగిన సంప్రదింపులు జరపకుండా కొత్త పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించడం వల్ల పరిపాలన, ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణం సహా అనేక పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త విధానానికి మారడానికి తగిన సమయం అవసరమన్నారు. కొత్త పథకం అమలును కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కేంద్రాన్ని మంత్రి సీతక్క కోరారు. ఉపాధి హామీ చట్టానికి అనుగుణంగా ప్రారంభమైన పనులకు ప్రస్తుత విధానంలోనే చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పథకంలో వ్యవసాయ సీజన్‌లో తప్పనిసరిగా 60 రోజులపాటు పనులు నిలిపివేయాలనే నిబంధన గ్రామీణ పేద కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం డిమాండ్ ఆధారితంగా ఏడాది పొడవునా కొనసాగాలని, గ్రామీణ కార్మికులకు అవసరమైన సమయంలో ఉపాధి కల్పించే వెసులుబాటు ఉండాలని సూచించారు. నిధుల కేటాయింపులో ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఆధారిత విధానానికి బదులుగా స్థిరమైన (నార్మేటివ్) కేటాయింపులను ప్రతిపాదించడం వల్ల అధిక డిమాండ్ ఉన్న సమయంలో నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. గత ఐదేళ్ల పనిదినాల ఆధారంగా నిధులను నిర్ణయించడంతోపాటు ప్రతి మూడు నెలలకో£సారి సమీక్షించి అదనపు నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కొత్త పథకంలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య నిధుల విధానం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని మంత్రి సీతక్క వివరించారు. ఎంజీఎనఆరఈజీఏలో అమలవుతున్నట్లు నైపుణ్యం లేని కార్మికుల వేతనాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని, మెటీరియల్ వ్యయంలో 75 శాతం కేంద్రం వాటా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలకు ప్రత్యేక పనులను చేర్చుకునే స్వేచ్ఛ కల్పించాలని మంత్రి కోరారు. వ్యవసాయ అనుబంధ పనులు, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల వంటి పనులను అనుమతించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేద కుటుంబాల జీవనోపాధి భద్రత లక్ష్యాలు దెబ్బతినకుండా కొత్త పథకంలో అవసరమైన మార్పులు, సడలింపులు చేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు. సీతక్క ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. మంత్రి సీతక్క చాలా యాక్టివ్ మినిస్టర్ అని ప్రశంసించారు. తెలంగాణ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై మంత్రి సీతక్కతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





