– డేటా ఇంటెలిజెన్స్, ఏఐ, బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో సేవలు
– లాంఛనంగా ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా ఎంటర్ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సేవలందిస్తున్న స్ప్లాష్బీఐ (SplashBI) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో 515కు పైగా జీసీసీలు ఉండగా వాటిలో మూడు లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారన్నారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. వచ్చే ఏడాదిలో కొత్తగా వంద జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం చేయకుండా ప్రపంచస్థాయి ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లోనూ కీలక పాత్ర పోషించేలా వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. స్ప్లాష్బీఐ ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 500కు పైగా ఎంటర్ప్రైజ్ సంస్థలకు సేవలందిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో హైదరాబాద్‌లో వంద మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ తోపాటు స్ప్లాష్ ఏఐ సామర్థ్యాలనూ అభివృద్ధి చేస్తుందని, ఇక్కడ కొత్తగా 275మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్ప్లాష్బీఐ సీఈవో నవీన్ మిగ్లానీ, ప్రెసిడెంట్, సీటీవో కిరణ్ రెడ్డి పాశం తదితరులు పాల్గొన్నారు.
zతెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





