– ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల
– త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో పాల్గొన్న భట్టి
మధిర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, వివిధ కార్పొరేషన్ చైౖర్మన్లు, డీసీసీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎర్రుపాలెం మండలం బంజరలో రెడ్డిబోయిన నాగమణి-కృష్ణయ్య, పెద్ద గోపవరంలో మోదుగు సీతారాజ్యం-గోపి, మధిర మండలం దెందుకూరులో ముప్పసాని కృష్ణవేణి-రాంబాబు దంపతుల ఇళ్లల్లో, మల్లారంలో యంద్రాతి అచ్చారావు, బోనకల్ మండలం రాయణపేటలో పర్సగానీ గోపి, చింతకాని మండలం పొద్దుటూరులో రెళ్ళ రాసి-తిరుపతి రావు, ముదిగొండ మండలం వనం వారి కిష్టాపురంలో పి.గంగా భవాని-శ్రీహరి, ముదిగొండలో కె.శ్రీలత-రాజేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఇళ్లలో స్థానిక ప్రజలతో కలిసి ఉప ముఖ్యమంత్రి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి లబ్దిదారుల కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్నారు. ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరడంతో ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నామని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా గ్రామాల ప్రజలు, ఇళ్ల లబ్దిదారులు ఉప ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. నేడు గ్రామ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో పాల్గొని పండుగను లబ్దిదారులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలిపారు. లబ్దిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని సొంతింటిలో గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. పేదలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఈ పథకం ఉపయోగ పడుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను, ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, వివరించారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో 105 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామని, ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 41 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు అందిస్తున్నామన్నారు. ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
zతెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





