సేవాభావమే అసలైన సంపద

– నిజాయతీ, ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలి
– కొత్త జిల్లా రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ఒక పదవి కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రూప్-1 ద్వారా నియమితులై శిక్షణ పొందిన అనంతరం వివిధ జిల్లాలకు నూతనంగా నియమితులైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు డి.మౌనికారాణి (నల్గొండ), సయ్యద్ యూసఫ్ ఆలీ(ఎంవి అండ్ ఎ-నల్గొండ), షగుఫ్టా ఫిర్‌దౌస్( వరంగల్) డి.సందీప్ కుమార్(సంగారెడ్డి), బొంగు మాధవ్( హైదరాబాద్- సౌత్), పి.దీపక్ (మహబూబ్‌నగర్) మంగళవారం నాడు సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖ నేరుగా ప్రజల ఆస్తులు, భూములు, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పని తీరుతోనే మీకు మంచి పేరు వస్తుంది.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవా దృక్పథంతో పనిచేయండి.. మీ కెరీర్‌లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు.. మీపై ప్రజలకు ఉండే నమ్మకం, మీ క్రెడిబిలిటీనే మీకు అసలైన సంపద అని మంత్రి వారికి సూచించారు. నిజాయతీగా, పారదర్శకంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, నిబంధనల పరిధిలో వేగంగా పరిష్కారాలు చూపాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు గౌరవంగా, సహాయకారిగా వ్యవహరించాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *