ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి

– వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి
– రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్‌లు కొనుగోలు చేయాలి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : మెట్రో రైలు రెండో దశలో భాగంగా పాత బస్తీ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ ఆర్ఎంఎల్)పై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాత బస్తీ మెట్రో పనులపై పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్‌లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలుపెట్టాలన్నారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా అదనపు బోగీలను జత చేయాలని, ఇందుకు సంబంధించి మెట్రో రైల్ కోచెస్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై దిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

డిసెంబర్‌లో నిర్వహించతలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *