– 15-30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి
– జిల్లా మానిటరింగ్ కమిటీల్లోో రైతులను భాగస్వాములను చేయాలి-
– ‘కపాస్’లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళతరం చేయాలి
– సీసీఐ అధికారులతో సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
– జిల్లా మానిటరింగ్ కమిటీల్లోో రైతులను భాగస్వాములను చేయాలి-
– ‘కపాస్’లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళతరం చేయాలి
– సీసీఐ అధికారులతో సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : రాష్ట్రంలో 2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సీసీఐ అధికారులతో మంగళవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పంట పండించిన రైతులకు మార్కెటింగ్‌లో ఎక్కడా ఇబ్బంది కలగకూడదని, వ్యవస్థలకు చెడ్డ పేరు రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మనం బతకాలంటే రైతు బతకాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లి మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పంట కోతకు దాదాపు రెండు నెలల ముందుగానే పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించడం మంచి పరిణామమన్నారు. సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నందున వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను ముందుగానే పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా, పారదర్శకంగా కొనుగోలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. గత సీజన్లలో పత్తి కొనుగోళ్లలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సీజన్‌లో అవి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, సుమారు 25.85 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. లాంగ్ స్టేపుల్ పత్తికి కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర ప్రకటించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.557 పెరిగిందని చెప్పారు. ప్రతి అర్హత కలిగిన రైతుకు ఎంఎస్‌పీ ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు అంతకంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 356 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎల్-1 నుంచి ఎల్-12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత సీజన్‌లో 122 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈ సీజన్‌లో 131 కేంద్రాలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. అన్ని కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మార్కెట్‌కు పత్తి రాక అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన మేరకు అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో జిన్నింగ్ మిల్లు అందుబాటులో లేకపోతే సంబంధిత గ్రామాలు, మండలాలను సమీపంలోని నోటిఫైడ్ మిల్లుకు అనుసంధానం చేసి రైతులు ఎక్కువ దూరం ప్రయాణించకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీల్లో రైతుల ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డులు, మిల్లుల వద్ద అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కొనుగోలు సమయాన్ని స్థానిక కమిటీలు పరిస్థితులకనుగుణంగా పొడిగించాలని సూచించారు.
‘కపాస్’ బుకింగ్‌ను సరళతరం చేయాలి
కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్స్ ఓపెన్ చేసే ముందు జిల్లా కలెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారులకు సమాచారం అందించి రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళీకృతం చేసి ఒక రైతు లేదా మొబైల్ నంబర్‌కు అవసరమైన విధంగా మల్టిపుల్ బార్ కోడ్ సౌకర్యం కల్పించాలన్నారు. పంట బుకింగ్ డేటాను ఎనఐసీ ద్వారా కపాస్ కిసాన్ యాప్‌కు అత్యంత వేగంగా బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర సగటు దిగుబడిని ప్రకటించి దానికంటే అధిక దిగుబడి పొందిన రైతులకు ఏఈవోల ద్వారా డిజిటల్ ఈల్డ్ సర్టిఫికెట్స్ వెంటనే జారీ చేయాలని మంత్రి సూచించారు. పత్తి అధికంగా ఉత్పత్తి అయ్యే జిల్లాల్లో అవసరమైన మేరకు కాటన్ టెస్టింగ్ ల్యాబులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో స్టేపుల్ లెంగ్త్, మైక్రోనైర్, తేమ శాతం తదితర నాణ్యత ప్రమాణాలను పరీక్షించే పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సీసీటీవీలు తప్పనిసరిగా పనిచేసేలా చూడాలన్నారు. ఎంఎస్‌పీపై పూర్తి అవగాహన కల్పించాలని, రైతు నేస్తం, గ్రామస్థాయి కార్యక్రమాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా సీసీఐ కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, స్లాట్ బుకింగ్ విధానం తదితర అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. రైతుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన 1800 599 5779 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, 88972 81111 వాట్సాప్ చాట్‌బాట్ సేవలను రైతులు వినియోగించుకునేలా ప్రచారం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ లేదా పెండింగ్ ఏర్పడినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతుకు ఎంఎస్‌పీ అందించడమే ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ఏ స్థాయిలో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని మంత్రి హెచ్చరించారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





