– చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం
– యుద్ధప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలి
– ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదు
– సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్
– ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : నిషేధిత ఆస్తుల పీవోబీ/22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో 22ఎ/పీవోబీ అంశంపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి కలెక్టర్లు, జిల్లా సబ్‌రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు తదితర వివరాలతో కూడిన అన్ని డాక్యుమెంట్లను ఈనెల 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టొచ్చని, రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్‌లకు స్పష్టత వస్తుందని, ఏది బోగస్, ఏది నిజమైన డాక్యుమెంట్ అనేదానిపై సూపర్ చెక్ చేసుకోవడానికి వీలుకలుగుతుందని అన్నారు. మరింత పారదర్శకత కోసం పహాణీలు కూడా సబ్ రిజిస్ట్రార్‌కు యాక్సెస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఏది సరైనది ఏది కాదు గుర్తించి సరైన వాటిని యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రజా కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు మరింత క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. 22ఎకు సంబంధించి ప్రజావాణితోపాటు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. సమస్య వచ్చినపుడు పరిష్కరించేదానికన్నా సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. పీవోబీ దరఖాస్తులకు సంబంధించి ¹కేసు వారీగా రోజూ సమీక్షించాలన్నారు. 22ఎ పేరిట ఉద్దేశపూర్వకంగా పేదోడికి, అర్హులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదని, అదనపు అధికారాలు వద్దని, ఈ విషయంపై గతంలోనే చాలా స్పష్టత ఇచ్చానని అన్నారు. ఆన్‌లైన్‌లో ఏది ఉంటే దానికి ఆమోదం తెలిపేవరకే వారి అధికారాలను పరిమితం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తేలేదంటూ ఏ చిన్న తప్పు చేసినా క్షమించేదిలేదు.. కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా సబ్ రిజిస్ట్రార్లు కలెక్టర్ దృష్టికి గాని ఐజీ దృష్టికి గాని తీసుకురావాలన్నారు. పీవోబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను గుడ్డిగా తిరస్కరించకుండా మూడు రోజుల సమయం తీసుకొని ఎందుకు తిరస్కరించవలసి వస్తుందన్న వివరాలను తెలియజేయాలన్నారు. పీవోబీకి సంబంధించి వచ్చిన ప్రతీ దరఖాస్తును ఇకనుండి తహసీల్దార్‌కు కాకుండా నేరుగా కలెక్టర్‌కే పంపాలి.. కలెక్టర్ నుండి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుండి కలెక్టర్ మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి అని చెప్పారు. గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర, పీఓబీ జాబితాలు వేర్వేరుగా ఉండేవి.. వీటిని సమీకృతం చేయడం వల్ల సబ్ రిజిస్ట్రార్ పరిశీలనలో కొన్ని ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్నందున మొత్తం రిజిస్ట్రేషన్ ఆపుతున్నారనే ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. తాజాగా అప్‌లోడ్ చేస్తున్న సమాచారంతో సరిపోల్చుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డి.ఎస్.లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ.జి రాజీవ్ గాంధీ హనుమంత్, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





