అందరి చూపు కెసిఆర్ పైనే..
నేటి నుంచే శాసన సభ బడ్జెట్ సమావేశాలు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మామూలుగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత తప్పనిసరిగా హాజరవుతారు. అందునా బడ్జెట్ సమావేశాల్లో వివిధ శాఖల కేటాయింపులు, పథకాలపై ప్రభుత్వం వెచ్చించనున్న లెక్కలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన చర్చ జరగడం సహజమే. గత బడ్జెట్ సమావేశాల్లో కూడా ఘాటైన చర్చే జరిగింది కానీ, అందులో ప్రధాన ప్రతిపక్షనేత కెసిఆర్ పాల్గొనకపోవడంపై అటు రాజకీయవర్గాల్లో, ఇటు ప్రజాస్వామ్య, మేధావి వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున తప్ప మిగతా రోజుల్లో కెసిఆర్ పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న ఆరోపణ నేటి వరకు కొనసాగుతూనే ఉంది.
దీనిపై అటు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, ఇటు బహిరంగ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నేటికీ తీవ్రంగా స్పందిస్తుండడం చూస్తున్నాం. కెసిఆర్‌లాంటి సీనియర్ నాయకులు అసెంబ్లీ సమావేశాలకు హాజరై తగిన సూచనలు, సలహాలివ్వాలని ఆయన అనేకసార్లు ప్రజాముఖంగా విజ్ఞప్తులతో కూడిన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కెసిఆర్‌నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన్ను ఎట్టిపరిస్థితిలో సభకు హాజరయ్యేవిధంగా చర్యలు తీసుకునేట్లుగా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌కూడా దాఖలైంది. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయపాల్‌రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అది ఇంకా విచారణలో ఉంది. ఇది ఇలా ఉంటే వాస్తవానికి అసెంబ్లీ జరిగిన 60 పని రోజుల్లో కచ్చితంగా ఒక్కసారైనా హాజరు కావాలన్న నిబంధన ఉన్నట్లు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో అసెంబ్లీకి హాజరుకాకుండా కెసిఆర్ భీష్మించుకుని కూర్చుంటే అనర్హత వేటు పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఇదిలా ఉంటే అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికి కావొచ్చన్నట్లుగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్‌లో కేసిఆర్ పాల్గొనబోతున్నారన్న సంకేతాలు ఆపార్టీ వర్గాల నుంచి వినవస్తున్నది. కొంతకాలంగా పార్టీ వర్గాలతో మంతనాలు చేపట్టినా, పార్టీ సమావేశాలైనా ఫాంహౌజ్‌లో నిర్వహిస్తూ వస్తున్న కెసిఆర్, ఈసారి పార్టీ కార్యాలయంలో ఎంఎల్‌ఏలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఎదురయ్యే సవాళ్లపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను ఎండగట్టడంలో ఏ మాత్రం వెనుకాడ వద్దని, గట్టిగా పోరాటం చేయాలని ఆయన వారికి సూచించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత గత బడ్జెట్ సమావేశాల్లో తప్ప కెసిఆర్ పెద్దగా జనంలో తిరిగింది లేదు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా పార్టీ పాల్గొనకపోవడంతో కార్యకర్తల్లో నిరాశ చోటుచేసుకుంది.
దీంతో ఎంఎల్‌ఏ ద్వారా ఎన్నుకునే ఎంఎల్సీ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా కొంత ఊరట కలిగించినట్లైంది. త్వరలో పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో ఉద్యమ స్ఫూర్తితో విజృంభించేందుకు పార్టీని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. పార్టీకి కష్టకాలం వొచ్చినప్పుడల్లా హనుమాన్ వ్యాయామ శాలగా, పార్టీ బలాన్ని బేరీజు వేసుకునేందుకు లిట్‌మస్ టెస్ట్‌లా వరంగల్‌లో భారీ బహిరంగ సభను పెట్టడం బిఆర్‌ఎస్‌కు మొదటి నుంచీ అలవాటు. ఆ సభ ద్వారా తమ విశ్వరూపాన్ని చూపి మరోసారి కదన రంగంలోకి దూకాలన్నది కెసిఆర్ మనోగతంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో అనర్హత వేటు నుంచి తప్పించుకోవడంతో పాటు, దానివల్ల వొచ్చే నింద నుండి బయటపడేందుకు కెసిఆర్ అసెంబ్లీకి తప్పక హాజరవుతారనుకుంటున్నారు. అయితే సమావేశాల చివరి వరకు ఉంటారా, గతంలో మాదిరి ప్రారంభ సమావేశానికి మాత్రమే పరిమితమవుతారా అన్న చర్చ ఇంకా కొనసాగుతున్నది.





