ఇదెక్కడి ధర్మం… ఇదెక్కడి నీతి!?

మా  ఎజెండా అమలుకు అడ్డొచ్చిన ఎవరినీ  బీజేపీ, సంఫ్‌ు  పరివార్‌ సులభంగా వొదిలిపెట్టదు. అది ఎలా వేటాడి ..వేధిస్తుందో చెప్పటానికి గుజరాత్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ ఉదంతం పెద్ద ఉదాహరణ. 27 సంవత్సరాల క్రితం పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితుడిని నేరం ఒప్పుకోవాలని ప్రమాదకర ఆయుధాలతో, కరెంట్‌ షాక్‌లతో టార్చర్‌ పెట్టారన్న కేసులో సంజీవ్‌ భట్‌ను నిర్దోషిగా గుజరాత్‌లోని పోర్‌బందర్‌ అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్టేట్ర్‌ కోర్టు ఇటీవల ప్రకటించింది. ప్రాసిక్యూషన్‌ సందేహింపజాలని సాక్ష్యాధారాలు చూపలేక పోయిందని, ఒక ప్రభుత్వ అధికారి ప్రాసిక్యూషన్‌కు సరైన అనుమతి తీసుకోలేదని కోర్టు తప్పుబట్టింది. కాగా రెండున్నర దశాబ్దాలకు పైన తనపై నమోద్కెన అభియోగాలు తప్పుడువని నిరూపించుకోడానికి పోలీస్‌ అధికారి భట్‌ పడ్డ వ్యయప్రయాసలు, ఎదుర్కొన్న మానసికవ్యధ మాటల్లో చెప్పలేం. ఇక్కడితోనే న్యాయ పోరాటం ఆగిపోయిందని, భట్‌ పూర్తిగా బయటపడ్డారనుకోవడానికి వీల్లేదు. ఎంతటి వారిన్కెనా బీజేపీ కేసుల్లో ఎలా ఇరికిస్తుందో భట్‌ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 1994లో ఆర్‌డిఎక్స్‌, ఇతర భయంకర అక్రమ ఆయుధాల ల్యాండిరగ్‌పై పోలీసులు 22 మందిపై టాడా కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. అహ్మదాబాద్‌ సబర్మతి జ్కెలులో ఉన్న నరన్‌ జాదవ్‌, ఇతర నిందితులను 1997లో పి.టి. వారెంట్‌పై పోర్‌బందర్‌కు విచారణకై తరలించారు. అక్కడ పోలీస్‌ కస్టడీలో నేరం ఒప్పుకోవాలంటూ ఎస్‌పిగా ఉన్న భట్‌, కానిస్టేబుల్‌ వాజుభాయి చౌ తమను టార్చర్‌ చేశారని నిందితుడు నరన్‌ జాదవ్‌ మేజిస్టేట్కు ఫిర్యాదు చేశాడు.

విచారణ తరువాత 2013లో భట్‌, చౌలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు మేజిస్టేట్ర్‌ ఆదేశించారు. తీర్పు వచ్చేలోపు కానిస్టేబుల్‌ చౌ చనిపోయాడు. టాడా కేసులోని నిందితుడి ఫిర్యాదుపై ఇన్నేళ్లు ఒక ఐపిఎస్‌ అధికారిపై కేసు నడవడం స్థానిక బీజేపీ ప్రభుత్వ ప్రోద్భలం లేకుండా అసంభవం. 61 సంవత్సరాల మాజీ ఐపిఎస్‌ మరో రెండు కేసుల్లో శిక్ష పడి రాజ్‌కోట్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇవి కూడా బీజేపీ వెనుకుండి బనాయించిన కేసులే.సంజీవ్‌ భట్‌పై బీజేపీకి ఎందుకంత కక్షనో అర్థం కావాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం 1990లో ఎల్‌కె అద్వానీ చేపట్టిన దేశవ్యాప్త రథయాత్రను నిలిపేశాక గుజరాత్‌లో పెద్దఎత్తున మత ఘర్ణణలు రేగాయి. జామ్‌జోథ్‌పూర్‌ బంద్‌లో ఘర్షణలు సృష్టిస్తున్న 150మందిని పోలీస్‌ అధికారిగా ఉన్న భట్‌ అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచిపెట్టాక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దాన్ని లాకప్‌ మరణంగా చిత్రీకరించడంతో ఆ కేసులో భట్‌ జీవిత ఖ్కెదు అనుభవిస్తున్నారు.

రాజస్థాన్‌కు చెందిన ఒక లాయర్‌ను 1996లో డ్రగ్స్‌ కేసులో  ఇరికించిన కేసులో 20 ఏళ్ల జ్కెలు శిక్ష అనుభవిస్తున్నారు. 2002లో గుజరాత్‌ మత ఘర్షణల విషయంలో అబద్ధపు సాక్ష్యాలు సృష్టించారన్న కేసులో సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌, నాటి డీజీపీ శ్రీకుమార్‌తో పాటు భట్‌ కూడా నిందితుడు. అన్నింటికీ మించి 2002లో గోద్రా అనంతర మారణకాండకు అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ  ప్రమేయం ఉందని భట్‌ అఫిడవిట్‌ ఇవ్వగా సిట్‌ తోసిపుచ్చింది. ఈ కోపంతో భట్‌ను ఏవో సాకులు చెప్పి సర్వీస్‌ నుంచి  2015లో గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేయగా, కేంద్రహోం మంత్రిత్వశాఖ ఏకంగా సర్వీస్‌ నుంచి తొలగించింది. న్యాయంకోసం భట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీజేపీ, మోదీతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని భట్‌ జీవితం ద్వారా తెలుస్తుంది. పైశాచికంగా సామూహిక ల్కెంగికదాడికి గురై, కుటుంబాన్ని కోల్పోయిన బిల్కిస్‌బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలకు క్షమాభిక్ష పెట్టగలరు. భీమాకొరేగావ్‌ వంటి కేసుల్లో ఏళ్లకు ఏళ్లు  బెయిల్‌ రాకుండా అడ్డుకోగలరు. తమ దారికి రాని భట్‌ వంటి అధికారులను వేధించగలరు. ఇదెక్కడి ధర్మం…ఇదెక్కడి నీతి!

-ఎం.ఎస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *