దక్షిణాది అభివృద్ధితోనే దేశాభివృద్ధి

– సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం
– కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలకు కేంద్రం సాయం చేయాలి
– 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశ నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ సిద్ధం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మహాబలిపురం, ఆగస్టు 20 : కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతోపాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భిన్నమైన ప్రయోజనాలు ఎదురైనప్పుడు కూడా న్యాయబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనగలగడమే సమాఖ్య వ్యవస్థకు అసలైన పరీక్ష అని పేర్కొన్నారు. మహాబలిపురంలో గురువారం జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన తెలంగాణ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీషన్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను ప్రస్తావించారు. బలమైన నిర్మాణానికి ప్రతి భాగం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని, ప్రతి భాగం తన వంతు భారాన్ని మోయాల్సి ఉంటుందని అన్నారు. భారత సమాఖ్య వ్యవస్థ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. భిన్నమైన ప్రయోజనాలను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సమర్థవంతంగా సమన్వయం చేయగల సంస్థలు ఉండటమే నిజమైన సమాఖ్యవాదమని స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రతిభ కోసం రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని ఆయన చెప్పారు. నదులు, విద్యుత్ గ్రిడ్లు, కార్మికులు, వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు అడ్డంకులు కావని డిప్యూటీ సీఎం చెప్పారు. సమస్యలు రాష్ట్ర సరిహద్దులను ప్రభుత్వ ఫైళ్ల కంటే వేగంగా దాటుతాయని భట్టి చమత్కరించారు. ఈ పరస్పర ఆధారిత పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ ప్రాంతీయ మండలి వంటి సంస్థల ప్రాధాన్యత మరింత పెరుగుతోందన్నారు. నిబంధనలు స్పష్టంగా ఉండడంతోపాటు అన్ని రాష్ట్రాలకు ఒకే నిబంధనలు వర్తించాలని తెలంగాణ కోరుకుంటోందని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటైన చట్టపరమైన వ్యవస్థల ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను తెలంగాణ కచ్చితంగా కోరుకుంటోందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను అడ్డుకోవాలని, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే సూత్రాలను వర్తింపజేయాలని ఆయన సూచించారు. తెలంగాణ-ఏపీ మధ్య కృష్ణా జలాల కేటాయింపు అంశం ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 పరిధిలో ఉందని గుర్తు చేశారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు. మిగులు జలాలపై దిగువ రాష్ట్రంగా తెలంగాణకు ఉన్న హక్కులను దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో భట్టి విక్రమార్క మరోసారి స్పష్టంగా చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించే చర్యలు కూడా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన పనులను పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడానికి కేంద్రం సహకరించాలన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు పెండింగ్‌లోనే

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అమల్లోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ సమస్యలకు తుది పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. పరిష్కారం అంటే అంతులేని ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించడం కాదని, ప్రతి కొన్ని సంవత్సరాలకు కొత్త అర్థాలు, వివరణలు ఇవ్వడం కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. పెండింగ్ అంశాలు ఇకపై తుది నిర్ణయాలు, సమర్థవంతమైన అమలు దిశగా సాగాలని తెలంగాణ కోరుకుంటోందన్నారు. షెడ్యూల్-9లోని ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనకు సంబంధించి 23 సంస్థలపై తెలంగాణ తన అభిప్రాయాలను ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సంబంధించి సమస్యల పరిష్కారానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపింది. సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని కోరుకుంటున్నప్పటికీ అది తప్పనిసరిగా చట్టపరమైన వ్యవస్థ పరిధిలోనే ఉండాలని స్పష్టంగా చెప్పారు. షెడ్యూల్-10 సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజనను ఆంధ్రప్రదేశ్ కోరుతోందని, అయితే పునర్వ్యవస్థీకరణ చట్టంలో అందుకు స్పష్టమైన ఆధారం లేవని ఆయన చెప్పారు. సెక్షన్ 75 కింద సౌకర్యాల కొనసాగింపునకు సంబంధించిన అంశాలు మినహా ఎలాంటి ఆస్తుల విభజనకు చట్టపరమైన మద్దతు లేదని తెలిపారు. ఈ అంశం ఏపీ హైకోర్టు పరిధిలో కూడా పెండింగ్‌లో ఉన్నందున చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియ ద్వారానే పరిష్కారం కనుగొనాలని కోరారు. నీటి భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, పట్టణీకరణ, రవాణా-లాజిస్టిక్స్, ఆర్థిక పోటీతత్వం వంటి అంశాలు రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కీలక సవాళ్లుగా మారనున్నాయన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పోటీ పడుతూనే పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందితే భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

తదుపరి 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆకాంక్షించారు. ట్రిబ్యునల్ లేకుండా, కమిటీ లేకుండా, బహుశా మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా సమస్యలు పరిష్కారం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

———————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *