మహిళ కడుపులో గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్

– ప్రసవం కోసం వెళ్లినపుడు నిర్లక్ష్యంగా సర్జరీ

ముంబై, ఆగస్టు 20 : ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లిన 19 ఏళ్ల మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఆపరేషన్ చేసిన తర్వాత గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్ ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. తీవ్ర కడుపు నొప్పి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. వడ్వాణి గ్రామానికి చెందిన సంధ్య ఈనెల 1న ప్రసవం కోసం బీడ్ జిల్లా హాస్పిటల్‌లో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమెకు ఆపరేషన్ చేశారు. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ పైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్‌లో ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పుణెలోని సాసూన్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు మరోసారి శస్త్రచికిత్స నిర్వహించి, ఆమె కడుపులో ఉన్న గ్లౌజులు, పేపర్ వైప్స్ ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారు. తన భార్య పరిస్థితికి మొదటి ఆపరేషన్‌లో జరిగిన నిర్లక్ష్యమే కారణమని సంధ్య భర్త సూరజ్ గైక్వాడ్ ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *