దసరానాడు వరంగల్ సూపర్ స్పెషాలిటీ సాఫ్ట్ లాంచ్‌

– 20 నుంచి ఓపీ సేవలు
– డిసెంబర్ రెండో వారంలో సీఎంతో  హాస్పిటల్‌  ప్రారంభించే అవకాశం
– రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ఉత్తర తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్‌గా రూపుదిద్దుకుంటున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీలో దసరా పండుగ(20వ తేదీ)రోజున ‘సాఫ్ట్ లాంచ్‌’(ట్రయల్ రన్) జరుగుతుందని, అదే రోజు నుంచి రోగులకు ఓపీ సేవలు అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ, సమాచారశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ‘కుడా’ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, వైద్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి క్రిస్టియానా జెడ్‌ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్ వాణిలతో కలిసి హాస్పిటల్‌ను సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీని త్వరతగతిన ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రస్థాయి అధికారులు క్రమం తప్పకుండా సందర్శిస్తూ పనుల్లో వేగం పెంచారు. దసరా నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో కనీసం ఓపి సేవలైనా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఓపీ సేవలు అందించేందుకు ఎంజీఎం, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని కొన్ని పరికరాలు తీసుకొచ్చి ఈ హాస్పిటల్‌లో ఏర్పాటు చేశారు. ఒకేసారి ఓపీ సేవలతోపాటు వైద్య సేవలు అందించాలంటే వైద్యులు, సిబ్బంది నియామకంతోపాటు మౌలిక వసతులు సమకూర్చాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగా ఓపీ సేవలు ప్రారంభించి క్రమేపీ రోగులు పెరిగినకొద్దీ వసతులు కల్పిస్తూ వైద్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ రెండో వారం(9వ తేదీన) సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
పేదవాడి వైద్యానికి పెద్ద పీట 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదవాడి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. హాస్పిటల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దసరా రోజున హాస్పిటల్ సాఫ్ట్ లాంచ్ జరుగుతుందని, అప్పటినుంచి ప్రజలకు ఓపి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన పనులను వేగవంతం చేసి తుది దశకు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో హైదరబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌లో ఏర్పాటవుతున్న ఈ హాస్పిటల్ వల్ల ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పరిధిలోని ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటకీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కొత్త దవాఖానాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎంజీఎంలో ఇప్పుడు సుమారు మÖడు వేల ఓపిలు ఉండగా నూతన హాస్పిటల్‌లో 4-5వేలకు పెరిగే అవకాశం ఉందన్నారు. నిమ్స్‌లో ఎలాంటి సేవలు అందుతున్నాయో నూతన హాస్పిటల్‌లో అలాంటి సేవలు అందిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే పైవేటు హాస్పిటల్స్ షట్‌డౌన్ కాక తప్పదన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీఎంహెచ్‌వో రాజారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అయూబ్ తదితరులు పాల్గొన్నారు.
కొండా వర్గం దూరం
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సేవలు ప్రారంభించేందుకు పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల బృందంలో కొండా దంపతుల వర్గం పూర్తిగా దూరంగా ఉంది. హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ హాజరు కావడం, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ రాకపోవడంపై పలువురు చర్చించుకున్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *