– ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక
– నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి
– రైతులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి
– ఎంత ఖర్చయినా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం
– వొచ్చే సీజన్లో రైతులు వరి పంట వేయొద్దు
– తాగునీటికే క్లిష్టమైన పరిస్థితి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ప్రస్తుత ఎల్‌నినోను ఎదుర్కొనడానికి అందుబాటులో ఉన్న మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించి ఒక కార్యాచరణను రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇది గతంలో వొచ్చిన ఎల్నినోలకంటే తీవ్రమైందన్నారు. నీటికొరత ఏర్పడే పరిస్థితి వున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.సాగు, తాగునీటి కొరతతో పాటు విద్యుత్ కొరత కూడా ఏర్పడుతోంది.వానాకాలంలోనే ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో వరి కాకుండా ఇతర పంటలు వేశారు.56 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు.అక్టోబర్ నెలలో 15 వేల మెగావాట్లు ఉండాల్సిన విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగింది. అంటే అదనంగా 5 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది.రాష్ట్రంలోని 30 లక్షల పంప్సెట్లు ఆన్ అయ్యాయి.మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత అక్టోబర్‌లో ఉంది.డిప్యూటీ సీఎం భట్టి, విద్యుత్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడం ద్వారా విద్యుత్ శాఖ మంత్రి, అధికారులు చిత్తశుద్ధిని చూపించారు.ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ పెరిగింది.ఈ రెండేళ్లలో ఆరు, ఏడు వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది.విద్యుత్ శాఖ సమర్థవంతంగా పనిచేసి రైతులకు, ఇతర అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.మరో 20 రోజుల్లో వానాకాలం పంటలు కోతకు వస్తాయి.చేతికొచ్చిన పంట ఎండిపోకూడదన్న లక్ష్యంతో మార్కెట్లో ఏ ధరకు విద్యుత్ దొరికినా కొనుగోలు చేసి రైతులకు అందిస్తున్నామన్నారు.కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా విద్యుత్ కొరతతో ఉన్నాయి.రైతులు మనోధైర్యం కోల్పోకుండా మా ప్రభుత్వం విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.గృహ అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ను అందిస్తున్నాం.కృష్ణా బేసిన్లో 72 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి.గోదావరి బేసిన్లో 40 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి.23 శాతం లోటు వర్షపాతం ఉంది.అన్ని రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయి.24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉంది.తాగునీటికే ఈ రోజు క్లిష్టమైన పరిస్థితి ఉందని గుర్తు చేశారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం
చలికాలం ఎండాకాలంలా ఉంది. వచ్చే 8 నుంచి 10 నెలల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.కేంద్రం నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలనే దానిపై ఈ రోజు సమావేశంలో చర్చించాం.10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఉందని నివేదికలు వచ్చాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ పంటను ఎండిపోనివ్వొద్దని అధికారులను ఆదేశించామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడాలి.సాగుకు నీటిని పొదుపుగా వినియోగించాలి.460 టీఎంసీలు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం 209 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఈ నీటిని పంటలకు ఇస్తే కేవలం నారుమళ్లకే సరిపోతాయి.ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.అందుబాటులో ఉన్న 200 టీఎంసీల నీళ్లను పొదుపుగా వినియోగించుకోవాలి. ఈ నీటిని కేవలం తాగునీటి కోసమే వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.రైతులు పెద్ద మనసు చేసుకుని యాసంగిలో పంటలు వేయడం తగ్గించుకోవాలని కోరారు.చుక్క చుక్కను ఆదా చేసుకోవాలి. వచ్చే సీజన్లో వరి వేయడాన్ని వాయిదా వేసుకోవాలి.ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టడానికి కార్యాచరణను రూపొందిస్తున్నాం.గత ఏడాది ఈ సమయంలో 25 వేల మంది ఉపాధి హామీ పనులు చేస్తే, ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పనుల్లో పాల్గొంటున్నారు.ఉపాధి హామీ పథకంలో చెరువులు, కుంటలను ప్రాధాన్యతగా తీసుకుని మరమ్మతులు చేయాలి.వానాకాలంలో నష్టపోయిన పంటతో పాటు వచ్చే సీజన్లో పంట వేయకుండా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలన్నారు.కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇచ్చే పథకాల ద్వారా రైతులను ఆదుకోవాలి.కేంద్ర ప్రభుత్వం నుంచి ఉదారంగా సాయం తీసుకునే అంశంపై అధికారులు నివేదికలు తయారు చేయాలి.
ఓవర్‌లోడ్ వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఓవర్‌లోడ్ వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతోంది. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను తీసుకుని, మిగిలిన రాష్ట్రాలకు తక్కువ ధరకు కేంద్రం అందించాలి. కోవిడ్ సమయంలో ప్రధాని మోదీ ఏం చేయమన్నా చేశాం. ఆ రోజు విధానాలు, జెండాలు మేం చూడలేదు. ఒకే విధానంలో ముందుకు వెళ్లాలన్న ప్రధాని అప్పీల్‌కు అనుగుణంగా ముందుకు వచ్చాం. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అదే స్ఫూర్తితో వ్యవహరించాలి. అన్ని పార్టీలు, ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వ సూచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ప్రకృతి విపత్తును కలిసికట్టుగా నిలబడి ఎదుర్కోవాలి. అందరి సహకారం ప్రభుత్వానికి కావాలి. మీడియా సహకారం ప్రభుత్వానికి వందకు వంద శాతం అవసరం. ప్రభుత్వం నుంచి మీడియా కోసం ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తాం. టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాం. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు.. అందరితో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అత్యంత ముఖ్యం. లేకుంటే పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం.పేదలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే ఆదుకోవాలన్న కార్యాచరణను రూపొందించాం. ఎల్‌నినోను ఎదుర్కోవడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఈ సమస్యను ఎదుర్కోవడంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రభుత్వం నిత్యం దీనిపై అప్రమత్తంగా ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరిస్తాం. ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రిని, ఇతర మంత్రులను కలుస్తాం. ప్రజలను చైతన్యపరచడానికి కళాజాతాలను ఏర్పాటు చేస్తాం. సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాయాలి. సినీ నటుడు విజయ్ దేవరకొండ ఎల్‌నినోపై ఒక విజ్ఞప్తి చేశారు. మిగిలిన సినీ నటులు, క్రీడాకారులు, కళాకారుల సహకారం తీసుకుని వారితో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయించి అప్రమత్తం చేస్తాం. అందరి సమస్య.. అందరం కలిసి విజయవంతంగా ఎదుర్కోవాలన్నారు.
కరువుకు కాంగ్రెస్ కారణం ఎలా అవుతుంది?
– విదేశాల్లో కూడా కాంగ్రెస్ ఉన్నదా..
– విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ ఎస్ భారీ అవినీతి
కాంగ్రెస్ వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎల్‌నినో పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం సందర్భంగా గత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందనడం బీఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందానికి నిదర్శనమని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలతోపాటు బ్రిటన్, జపాన్ వంటి వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉందని, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే ఉందా అని ఆయన ప్రశ్నించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ అబద్ధాలతో ప్రభుత్వంపై బురదజల్లి మళ్లీ అధికారంలోకి రావాలని పగటికలలు కంటున్నారని విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణ శాసనం
కృష్ణా జలాల పంపిణీలో గత ప్రభుత్వం తెలంగాణ హక్కులను శాశ్వతంగా ఏపీకి తాకట్టు పెట్టిందని సీఎం ఆరోపించారు. 2015లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 515 టీఎంసీలు చాలని సంతకం పెట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టినా పాలమూరు-రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి పంచపాండవుల చెరువు ద్వారా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 400 ఎకరాలకు ప్రత్యేకంగా నీళ్లు ఎలా తీసుకువెళ్లారో ప్రజలకు తెలుసునన్నారు.
యాదాద్రి విద్యుత్ ప్లాంట్, విదేశీ బొగ్గులో వేల కోట్ల అవినీతి
రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లతోపాటు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని విమర్శించారు. యాదాద్రి ప్రాజెక్టు అంచనాలను ఏకంగా 110 శాతం పెంచి రూ.37,781 కోట్ల అదనపు భారం మోపారని, యూనిట్ నిర్మాణానికి రూ.9.5 కోట్లు వెచ్చించి అందులో సుమారు రూ.8,000 కోట్లు మింగేశారని ఆరోపించారు. సింగరేణిని నిండా ముంచి ఉద్దేశపూర్వకంగా విదేశాల నుంచి ‘గ్రేడ్ 9’ బొగ్గును దిగుమతి చేసుకునేలా కుట్ర చేశారని సీఎం విమర్శించారు. టెండర్లలో సింగరేణి పాల్గొనకుండా చేసి 14 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకునే పరిస్థితి తెచ్చారన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఒక ముసుగు వీరుడిని తయారు చేశారని ఆరోపించారు.
బహిరంగ విచారణకు, చర్చకు మేము సిద్ధం.. మీరు సిద్ధమా?
ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, నీటి వాటాలు, విదేశీ బొగ్గు దిగుమతి వ్యవహారాలపై ఏ విచారణకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేటీఆర్ రాసిన లేఖ ఆధారంగా విచారణకు ఆదేశించడానికి తాను సిద్ధమని, అవసరమైతే ప్రజా కోర్టులో బహిరంగ విచారణ చేయిద్దామని సవాల్ విసిరారు. గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని, బీఆర్ఎస్ చేసిన దొంగతనాలు, అవినీతిపై ఆధారాలతో నిరూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం యాదాద్రిలో దేశీయ బొగ్గును వాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
రేపటి అఖిలపక్ష సమావేశం వాయిదా
ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించాల్సి ఉన్న అఖిలపక్ష సమావేశం వాయిదా పడింది.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు