– బీమా అమలు చేయకుంటీ సీఎం ఇంటిని ముట్టడిస్తాం
– రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వలేక చేతులెత్తేసిన ప్రభుత్వం
– సీఎం, డిప్యూటీ సీఎంల వైఫల్యం రాష్ట్రానికి శాపం
– అధికార్లను కాదు మిమ్మల్ని సస్పెండ్ చేయాలి
–  సిద్దిపేటలో హరీష్ రావు ధ్వజంసిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేస్తున్నడని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. దేశం మెచ్చిన రైతు బీమా పథకాన్ని నిలిపివేసి రైతు కుటుంబాల ఉసురు పోసుకుంటున్నరని ఆగ్రహం వ్యక్తం చేసారు. సిద్దిపేటలో రైతు బీమా అందని 22 మంది రైతు కుటుంబాలతో క్యాంపు ఆఫీసు వేదికగా హరీశ్ రావు సమావేశమయ్యారు. వారితో కలిసి భోజనం చేసిన హరీశ్ రావు ఆయా కుటుంబాల స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. రైతు బీమా పథకం కింద రూ.5లక్షల సాయం అందకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి హరీశ్ రావుకు వారు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రైతు కుటుంబాల ఆవేదన చూస్తే మనస్సు చలించి పోతున్నదన్నారు. ఆగస్టు 15 నుంచి ఈరోజు వరకు ఒక్క సిద్దిపేటలోనే 22మంది రైతులు చనిపోయారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది రైతులు చనిపోయారు. రైతు బీమా నిలిపివేయడం వల్ల ఇప్పుడు ఆ మూడు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.రేవంత్ రెడ్డి కేసీఆర్ అమలు చేసిన పథకాలు కొనసాగిస్తున్నాం అని మాటలు చెప్పారు కానీ నిజానికి అన్నీ బంద్ చేస్తున్నారు. రైతు బీమా పథకం అమలు చేసి ఉంటే ఇంతమంది రైతు కుటుంబాలు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాయి.. వీరందరికి ఎందుకు రూ.5లక్షలు రాలేదు. ఆగస్టు 14 నుంచి ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో రైతు బీమా ఆగిపోయింది. ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న బాధితులకు మీరేం సమాధానం చెబుతారు? వీరిని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో చెప్పాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి, తుమ్మల వీరి బాధను ఎలా తీరుస్తారు? తుమ్మల నాగేశ్వరరావు ప్రాథమికంగా రైతు, మీరైనా ప్రీమియం చెల్లించాలని చెప్పాలి కదా. కొత్త పథకం తెస్తాం అని బడ్జెట్ లోచెప్పారు. ఆ పథకం ఇప్పటికీ అతీగతీ లేదు. గుంట భూమి వున్నా కేసీఆర్ పథకం వర్తింప చేసారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తింపచేసారు. మీరు చెప్పే పథకం ఇంటి యజమానికి మాత్రమే. ఐక్య రాజ్య సమితి సైతం మెచ్చుకున్న రైతు బీమా పథకాన్ని నిలిపివేసేందుకు మనసెలా వచ్చిందంటూ రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు మన పథకాన్ని చూసి అమలు చేస్తున్నా మీరు మాత్రం బంద్ చేసారు, ఏ కారణంతో చనిపోయినా రైతు కుటుంబం రోడ్డున పడొద్దని కేసీఆర్ రైతు బీమా అనే పథకానికి 2018లో రూపకల్పన చేసిండు. రైతుల తరపున ప్రభుత్వమే ఏటా రూ.1400 కోట్ల ప్రీమియం ఎల్ఐసీకి చెల్లించి రూ.5 లక్షల భరోసా కల్పించిండు. 2018–19 నుంచి 2023–24 వరకు వివిధ కారణాలతో మరణించిన 1,38,688 మంది రైతు కుటుంబాలకు రూ.7వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంచెల్లించింది. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పే రేవంత్ రెడ్డి..  ప్రీమియం రూ.1400 కోట్లు చెల్లించే తెలివి లేదా? వెంటనే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా రైతు కుంటుంబాలకు చెల్లించాలని, యదావిదిగా రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే మీరు 8 గంటలు కూడా ఇవ్వడం చేతకావడం లేదు. ఐఎఎస్, అధికారులను సస్పెండ్ చేస్తాం అని ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. సస్పెండ్ చేయాల్సింది మిమ్మల్ని. 9 నెలల నుంచే ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని చెబుతుంటే ఏం చేసారు?కరెంట్ సరఫరా చేయకపోవడం మీ చేతగాని తనం కాదా? విద్యుత్ అధికారులను బాధ్యులుగా చేసి ఎందుకు వారిపై చర్యలు తీసుకుంటు న్నారు. నీళ్లు ఉన్నా లిఫ్ట్ చేయలేదు, పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేదు. బొగ్గు నిల్వలు పెట్టుకోక కరెంట్ కోతలకు కారణం అయ్యారు. అధికారుల తప్పు కాదు ఇది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫెయిల్ అయ్యారు. మీ చేతగాని తనంతో విద్యుత్ అధికారులపై వేటు వేస్తారా?ప్రభుత్వం దిగిరాకపోతే రైతు కుటుంబాలతో కలిసి సీఎం ఇల్లు, సచివాలయం ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నామ‌న్నారు. రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దు.. బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది.. అసెంబ్లీ వేదికగా రైతు బీమాపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. మీకు బీమా డబ్బులు వచ్చేలా చేస్తామని హ‌రీష్‌రావు హామీ ఇచ్చారు.

—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు