నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలి

– ప్రామాణిక అర్బన్ పోలీసింగ్ అవసరం
– నేరాల కట్టడికి నిరంతర గస్తీ
– స్పందించే తీరును బట్టే పోలీసుల పనితీరుపై అంచనా
– మల్కాజిగిరి కమిషనరేట్‌ సమీక్షలో డీజీపీ ఆనంద్

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 15: నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్‌, పటిష్ఠ నిఘా, సత్వర స్పందన కీలకమని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. అర్బన్‌ పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్న విధానాలను వినియోగిస్తూ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. నేరాల స్వభావం, ప్రాంతాల వారీ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గస్తీ, నిఘా పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో సీపీ సుమతి, ఇతర పోలీసు అధికారులతో గురువారంనిర్వహించిన సమీక్షలో ఆయన నేరాల నియంత్రణ, దర్యాప్తు, రాత్రి గస్తీ, రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాలపై సమీక్షించారు. బొల్లారం కైకూరులోని విల్లా ఆర్కిడ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదు సంవత్సరాల పాప దారుణ హత్య ఘటన గుర్తు చేస్తూ నిందితుని అరెస్టు చేసినట్లు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా పోలీసులు నిరంతరం నిఘాతోపాటు సీసీ టీవీలు కమ్యూనిటీలో ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. దీంతో పాటు బొల్లారంలోని ఆయుధాల చోరీ కేసుకు సంబంధించిన అంశాలను కూడా ఆయ‌న‌ ప్రస్తావిస్తూ ఆయుధాల చోరీ కేసులో పటిష్టమైన దర్యాప్తుతో వెంటనే అరెస్ట్ చేసామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ దొంగతనాన్ని పాల్పడ్డ నేపాల్ గ్యాంగ్ సంబంధించిన వాటి పైన దృష్టి సాదించాలని, చోరీ కేసులు పటిష్ట నిఘాతోని నియంత్రించాలని ఆదేశించారు. కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాలపై కళాశాలలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ సూచించారు. ట్రాఫిక్‌ రద్దీ ప్రాంతాలు, ప్రమాదాల హాట్‌స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కీసర, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, బేగంపేట, జవహర్‌నగర్‌, మేడిపల్లి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో ఆస్తి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేరాల గుర్తింపు, సొత్తు రికవరీని మెరుగుపరచడంతోపాటు తీవ్రమైన నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. మురికివాడలు, బస్తీల్లో నేరాల హాట్‌స్పాట్లను గుర్తించి, పునరావృత నేరాలకు పాల్పడేవారిపై బైండోవర్‌ చర్యలు చేపట్టాలన్నారు.
మహిళలు, బాలికల భద్రతకు పోక్సో చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని డీజీపీ సూచించారు. షీ టీమ్స్‌ సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జవహర్‌నగర్‌, హయత్‌నగర్‌, కుషాయిగూడ, వనస్థలిపురం, కీసర పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేసులను క్షుణ్ణంగా సమీక్షించి, సాంకేతిక ఆధారాలతో సమర్థవంతంగా దర్యాప్తు పూర్తి చేసి, గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. బాధితులకు పరిహారం అందేలా చూడటంతోపాటు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు.

గస్తీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

పోలీసు స్టేషన్ల వారీగా నేరాల నమోదును విశ్లేషిస్తూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓలు) డయల్‌ 112 ఫిర్యాదులపై స్పందించడంతోపాటు గస్తీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేస్తే నేరగాళ్ల కదలికలను నియంత్రించవచ్చన్నారు. పాత నేరగాళ్ల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, రౌడీషీటర్లను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇందుకుగాను 1992 సంవత్సరంలోనే రౌడీలను, ఆర్గనైసేడ్ క్రైమ్స్ ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.నేరం జరిగిన వెంటనే సంబంధిత బృందాలు రంగంలోకి దిగి ఆధారాలను సేకరించి, నిందితులను గుర్తించేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. డివిజన్‌ ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, సెక్టార్‌ పోలీసులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.

కమిషనరేట్‌ పరిధిలో అక్టోబరు 13 నాటికి 2,474 కేసులు 

కమిషనరేట్‌ పరిధిలో 2026 అక్టోబరు 13 నాటికి 2,474 కేసులు నమోదైనట్లు సీపీ సుమతి వివరించారు. 2024లో 18,778 కేసులు నమోదు కాగా, 2025లో 18,480 కేసులు నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు ఈ సంఖ్య 23,747కు చేరింది. ముఖ్యంగా దొంగతనాలు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, గాయపరిచే ఘటనలు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.2026లో ఇప్పటివరకు 2,196 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. 2024లో 1,484, 2025లో 1,662 కేసులు నమోదయ్యాయి. మోసాల కేసులు 2024లో 2,404 ఉండగా, 2025లో 2,636, 2026లో 2,789కు పెరిగాయి. గాయపరిచిన ఘటనలు 2024లో 1,311 నుంచి 2026లో 1,797కు చేరాయి. రోడ్డు ప్రమాద మరణాలు 2024లో 308, 2025లో 270 ఉండగా, 2026లో ఇప్పటివరకు 340 నమోదయ్యాయి. హత్యలు 2024లో 40, 2025లో 45, 2026లో 41గా ఉన్నాయి. కిడ్నాప్‌ కేసులు 2026లో 365కు చేరాయి. ఈ నేపథ్యంలో నేరాల నియంత్రణ, దర్యాప్తు, సొత్తు రికవరీపై పోలీసులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.నేరాల గణాంకాలను విశ్లేషించి, పెరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీ అధికారులకు సూచించారు. కమిషనరేట్‌ పునర్వ్యవస్థీకరణతో కొన్ని పోలీసు స్టేషన్ల పరిధులు మారాయని, సిబ్బంది కేటాయింపుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.నిందితులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తిస్తే, సంబంధిత బృందాలు వెంటనే వెళ్లి వారిని పట్టుకునేలా అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. ఎస్‌ఓటీ బృందాలు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాల మరణాలపై డీజీపీ ఆరా తీశారు. కీసర, చర్లపల్లి, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో గత ఏడాదితో పోలిస్తే ప్రమాద మరణాల సంఖ్య పెరిగినట్లు అధికారులు వివరించారు. ద్విచక్రవాహన ప్రమాదాలు సుమారుగా 25% అధికంగా ప్రాణనష్టానికి కారణమవుతున్నాయని పేర్కొంటూ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని డిజిపి సూచించారు. విజయవాడ–వరంగల్‌ మార్గం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాల్లో పెట్రోలింగ్‌ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. కమిషనరేట్‌ పరిధిలో ప్రతిరోజూ సుమారు 10 నుంచి 11 సైబర్‌, వైట్‌ కాలర్‌ నేరాల కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో నైపుణ్యం పెంచేందుకు అవసరమైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని డిజిపి సూచించారు. డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా సరూర్‌నగర్‌లో ఈగల్‌ పోలీసు స్టేషన్‌ ఉపయోగించుకోవాలని డిజిపి సూచించారు. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అధికారులను గుర్తించి ప్రోత్సాహకాలు, రివార్డులు అందించాలని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రౌడీషీటర్లు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా కొనసాగించాలని, వివిధ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.కమిషనరేట్‌ పునర్వ్యవస్థీకరణ అనంతరం మల్కాజిగిరికి 235 పోస్టులు రావాల్సి ఉన్నట్లు సీపీ సుమతి వివరించారు. సమావేశంలో డీసీపీలు , ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *