– మొదటిసారిగా రథారోహణ
– పూర్తి కావచ్చిన మాడ వీధుల నిర్మాణం
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
వరంగల్ ప్రజల ఇలవేల్పుగా విలసిల్లుతున్న భద్రకాళి అమ్మవారి రథోత్సవాన్ని మొదటిసారిగా శనివారం నిర్వహించనున్నారు. శతాబ్ధాల చరిత్ర ఉన్న భద్రకాళి ఆలయంలో ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి అత్యంత వైభవంగా మాడవీధుల చుట్టూ ప్రదక్షిణ జరపమన్న కొత్త సంప్రదాయం ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఆచరణలోకి రాబోతున్నది. ఇందుకోసం ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన మాడవీధుల నిర్మాణ కార్యక్రమాలు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఆలయ పునరుద్దరణ పనులకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టినప్పటికీ పనులు నేటివరకు మందకొడిగా జరుగుతూ వచ్చాయి. చెరువు పూడికతీత మొదలు, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించి మాడవీధులను తీర్చిదిద్దడం, ఇంతకాలంగా ప్రధాన పూజారి నివాసంగా ఉన్న నిర్మాణాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపట్టడంలాంటి పనులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇందుకుగాను రాష్ట్రప్రభుత్వం సుమారు 54 కోట్లను కేటాయించింది. అందులో భాగంగానే వినూత్నంగా అమ్మవారి ఊరేగింపుకు రథాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటివరకు ఆలయం లోపల పల్లకీలో అమ్మవారిని మేళతాళాలతో ఊరేగించేవారు. కాని ఇకనుండి బాహ్య వలయంలో నిర్మించిన మాడవీదులగుండా అమ్మవారిని ఊరేగించాలన్న నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఆలయాన్ని మధుర మీనాక్షి ఆలయంలాగా తీర్చిదిద్దాలన్నది స్థానిక నాయకులు, భక్తుల కోరిక. ఈ నెల 17న అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మాడవీదుల పనులు ఇంకా పూర్తికాలేదు. అయితే తాత్కాలికంగా మట్టి పనులను పూర్తిచేసి ఆ రోజున రథోత్సవానికి ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
తుదిమెరుగులు దిద్దుకుంటున్న రథం 
ఆలయ ముఖమంటపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్థంభం నుండి రథోత్సవం ప్రారంభమై, తిరిగి (638 మీటర్లు) అక్కడికి చేరుకుంటుంది. భారీగా సుమారు 36 అడుగుల ఎత్తు, 9 అడుగుల వలయంతో ఏర్పాటు చేస్తున్న ఈ రథం ఇంకా తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. సుమారు 25 నుంచి 30 టన్నుల బరువు ఉండే ఈ రథ నిర్మాణానికి బలార్షానుంచి మంచి టేకు కలపను తెప్పించారు. రథచక్రాలు, అధిష్టాన పీఠం కోసం నారప, వేప కర్రను వినియోగించారు. అధిష్టానం చుట్టూ పురాణ గాథలకు సంబందించిన చిత్రాలను, ఏనుగులు, గుర్రాలు, హంసల వరుసలను సూక్షంగా చెక్కారు. ప్రధాన పీఠమంతా టేకు కర్రను ఉపయోగించారు. ఇది 27 అడుగుల ఎత్తుతో ఉంటుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూర్చోబెట్టేందుకు కావల్సిన స్థలం ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిచుట్టూరా భద్రకాళిమాతతోసహా, సప్తమాతృకలు, సింహాలు, గుర్రాలు, ద్వారకన్యలు, లక్ష్మి, సరస్వతి, నాగబంధాన్ని అందంగా చెక్కారు. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన స్థపతి వల్లినాయక్ పదహారు మంది పనివాండ్రతో దాదాపుగా ఎనిమిది నుండి తొమ్మిది నెలలుగా రాత్రి పగలు లేకుండా రథ నిర్మాణానికి కష్టపడుతున్నారు. రథం పైబాగాన సుమారు మూడు అడుగుల ఎత్తున శిఖర కలశాన్ని ఏర్పాటు చేశారు. సహజంగా ఆలయ గోపురాల ఆకారంలో ఏర్పాటు చేస్తున్న దీనిపై బంగారం లేదా రాగి కలశాన్ని ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భక్తులు రథాన్ని లాగే క్రమంలో వినియోగించేందుకు యానాం నుండి ప్రత్యేకంగా 26అడుగుల పొడవైన కొబ్బరి తాడును తెప్పించారు. ఇందులో మరో విచిత్రకర విషయమేమంటే రథాన్ని లాగినప్పుడు అదుపు తప్పకుండా దీనికి స్పీడ్‌బ్రేక్ లాంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇకనుండి ఆలయంలో ప్రతీఏటా నిర్వహించే వసంత నవరాత్రి ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఈ రథాన్ని వినియోగంలోకి తీసుకురానున్నారు. ఇదిలాఉంటే భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ నుండి ఆలయంలో బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజున భేరీపూజ, ధ్వజారోహణ, కలశస్థాపన, నవరాత్రి వ్రతంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణగా, గాయత్రీదేవీ, మహాలక్ష్మిగా, గురువారం లలితాత్రిపురసుందరిగా అలంకరించారు. శుక్రవారం భవానిగా, శనివారం సరస్వతిగా, ఆదివారం అమ్మవారి పుట్టిన రోజున మహాదుర్గగా అలంకరిస్తారు. సోమవారం మహర్నవమి రోజున మహిషాసురమర్థనిగా అలంకరించి ఆ మరుసటిరోజున జరిగే విజయదశిమి వేడుకల సందర్భంగా మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. 21వ తేదీన భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవంతో ఈ ఉత్సవాలు పూర్తికానున్నాయి. అయితే తెప్పోత్సవానికి కావల్సిన నీరు ఇప్పుడు భద్రి చెరువులో లేకపోవడంతో దేవాదుల నీటిని తరలిస్తున్నారు. రెండేళ్ళ కింద చేపట్టిన చెరువు పూడికతీత పనులు ఇంకా పూర్తికాకపోవటంతో దేవాదుల పంప్‌హౌస్ నుంచి వయా ధర్మసాగర్, వడ్డెపల్లి, దేశాయిపేట ఫిల్టర్‌బెడ్ లద్వారా భద్రకాళి ఇన్‌టేక్ పాయింట్‌కు నీటిని తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




