– భోత్రా లాజిస్టిక్స్ తో సీఎం చీకటి ఒప్పందం
– కావాలనే కృత్రిమ బొగ్గు కొరత
– కరెంట్ సంక్షోభం సృష్టించిందే రేవంత్
– మొత్తం స్కాంపై స్వతంత్ర విచారణ జరపాలి
– సింరేణికి రూ.60వేల కోట్ల బకాయిలకు ఎగనామం
– దిగుమతి చేసుకునే బొగ్గుకు టన్నుకు రూ.1500 కమీషన్
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రాష్ట్రంలో బొగ్గు, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి ఇప్పుడు అదే సంక్షోభాన్ని కుంటిసాకుగా చూపి విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో సుమారు రూ.3,000 కోట్ల భారీ బొగ్గు కుంభకోణానికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో తీవ్రంగా తప్పుబట్టారు. ఇటు సింగరేణికి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా, అటు దేశంలో బొగ్గు వనరులు అందుబాటులో ఉన్నా దేశీయ సరఫరాను పెంచే దిశగా చర్యలు తీసుకోకుండా విదేశీ బొగ్గు వైపే మొగ్గు చూపడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు కరెంట్ కోతలపై ప్రజలు, రైతుల ఆందోళనను బూచిగా చూపి దిగుమతులకు అనుకూలంగా మలుచుకోవడం వెనక భారీ స్కాం దాగి ఉన్నట్టు అర్థమవుతోందన్నారు. ఈ వ్యవహారంలో భోత్రా లాజిస్టిక్స్ అనే కంపెనీ పాత్ర అత్యంత అనుమానాస్పదంగా కనిపిస్తోందని, ఈ కంపెనీకి సింగరేణిలో కాంట్రాక్టులు అప్పగించడంలో అనుసరించిన ప్రమాణాలేమిటి? ఏ అర్హతల ఆధారంగా ఈ సంస్థను ఎంపిక చేశారు? టెండర్ల ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. లాజిస్టిక్స్ తో సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, టెండర్ల వివరాలు, చెల్లింపులన్నింటినీ బహిర్గతం చేయాలి.. ఈ కంపెనీ ఎంపికకు కారణాలు, దానికి ఇప్పటివరకు అప్పగించిన కాంట్రాక్టులు, చెల్లించిన నిధులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు దిగుమతుల వ్యవహారంలో ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారో ముఖ్యమంత్రి ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. టన్నుకు రూ.1,500 కమీషన్ చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్నట్టు అర్థమవుతోందన్నారు.
విద్యుత్ డిమాండ్ వేసవిలో పెరుగుతుందని, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతర బొగ్గు సరఫరా అవసరమని ప్రభుత్వానికి ముందే తెలుసు. గనుల అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాలు, బొగ్గు నిల్వలు, రవాణా, దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడం ఈ సంక్షోభంలో కీలకమైన అంశమని. 2023–24లో సుమారు 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదు కాగా, 2025–26లో ఉత్పత్తి సుమారు 58 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఇది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా, మీ నిర్లక్ష్యానికి ప్రజాధనం వృధా చేసి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎందుకు సృష్టించారు అని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. గనుల అభివృద్ధికి, ఉత్పత్తి పెంపునకు అవసరమైన నిధులు అందించకుండా సింగరేణి సామర్థ్యాన్ని దెబ్బతీసి, ఆ తర్వాత దేశీయ బొగ్గు సరిపోవడం లేదని చెప్పడం మీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా? అని ప్రశ్నించారు.
ఒడిశాలోని నైని బ్లాక్లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో అక్కడి నుంచి సరఫరాను పెంచేందుకు ఏ చర్యలు తీసుకున్నారు? మహానది ప్రాంతం నుంచి బొగ్గు సరఫరా చేసుకునే అవకాశాలున్నా ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని కోరారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు సరఫరా విషయంలోనూ మీ వాదనకు అర్థంలేదన్నది స్పష్టమైందన్నారు. 2018 ఫిబ్రవరి 15న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎఫ్.నెం.23014/1/2018-సీఎల్డీ ప్రకారం సింగరేణి గనుల నుంచి యాదాద్రికి సంవత్సరానికి 14 మిలియన్ టన్నుల జి-9 గ్రేడ్ బొగ్గు సరఫరాకు లింకేజీ కేటాయింపు జరిగింది. 2022 ఏప్రిల్ 27న సరఫరాకు సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. మరి ఇప్పుడు బొగ్గు కొరత, నాణ్యత సమస్యల పేరుతో విదేశీ బొగ్గు దిగుమతుల అవసరాన్ని ఎందుకు ముందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు, యాష్ హ్యాండ్లింగ్ వంటి పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన దుర్మార్గంపై మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జెన్కోకు థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. సుమారు 7,500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్వహణ అనుభవం ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని వినియోగించకుండా ప్రైవేటు సంస్థలకు పనులు అప్పగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కరెంట్ కోతలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెరిగినప్పుడు ప్రభుత్వం అధికారులపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూడటం హేయమైన చర్య అన్నారు. నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విదేశీ బొగ్గు దిగుమతుల ప్రతిపాదనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, రూ.3,000 కోట్ల బొగ్గు కుంభకోణంపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి.. సింగరేణికి రావాల్సిన బకాయిలపై సంస్థల వారీగా పూర్తి లెక్కలు ప్రకటించాలి.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు సరఫరాపై స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





