‘సర్’పై ఈసీకి ‘సుప్రీం’ నోటీసులు

– రాహుల్ గాంధి–’ఇండి’ కూటమి పిటిషన్ విచారణకు స్వీకరణ
– సీఈసీ, ఈసీల నుంచి సమాధానం కోరిన కోర్టు
– జంతర్మంతర్ విషయంలో కేంద్రానికి నోటీసులు
– హైదరాబాద్ లో రెండు లక్షలమందితో భారీ సభకు కాంగ్రెస్ సన్నాహాలు

ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | దిల్లీ | అక్టోబర్ 15: వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘం నిర్ణయాలను సవాలు చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నాయకులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది. గతంలో రిజిస్ట్రీ పేర్కొన్న సాంకేతిక అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం పిటిషన్ విచారణకు వొచ్చింది. ఎస్ఐఆర్‌పై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సంబంధిత కేసులతో దీన్ని జతచేయాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే ఎస్ఐఆర్‌ను నిలిపివేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.

రాహుల్ గాంధీ ప్రవర్తనపైనా న్యాయస్థానం వ్యాఖ్యలు

విచారణ సందర్భంగా అక్టోబర్ 12న ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టు వైపు నిర్వహించిన ప్రదర్శన అంశం ప్రస్తావనకు వొచ్చింది. న్యాయవ్యవస్థపై రాజకీయ ప్రదర్శనల ద్వారా వొత్తిడి తీసుకురావడం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్లలో ఒకరి ప్రవర్తనపై వివరణ కోరాల్సి ఉంటుందని పేర్కొంది. న్యాయస్థానాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగరాదన్న అభిప్రాయాన్ని ప్రధాన న్యాయమూర్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రతిపక్షాల పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఎన్నికల సంఘం నుంచి సమాధానం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జంతర్‌మంతర్‌పై కేంద్రానికి నోటీసులు

జంతర్‌మంతర్‌ను అధికారిక నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. చారిత్రకంగా ప్రజా ఉద్యమాలకు వేదికగా ఉన్న జంతర్‌మంతర్‌లో నిరసనల నిర్వహణను నిషేధించడం రాజ్యాంగబద్ధమైన శాంతియుత నిరసన హక్కును ప్రభావితం చేస్తుందన్నది పిటిషనర్ల వాదన.అయితే జంతర్‌మంతర్‌ను తిరిగి నిరసన స్థలంగా గుర్తించాలని న్యాయస్థానం ఇంకా ఆదేశించలేదు. నిషేధ నిర్ణయం న్యాయపరమైన పరిశీలనలోకి రావడమే ప్రస్తుత పరిణామం.

మహిళా జర్నలిస్టులపై వేధింపులు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నిరసనలను కవర్ చేసిన మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులు, దాడులు జరిగాయన్న ఆరోపణలను గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
వేధింపుల ఆరోపణలు చేసిన ఒక మహిళా జర్నలిస్టుపై పోలీసు అధికారి ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎస్సీ/ఎస్టీ చట్టం కేసులో బలవంతపు చర్యలు తీసుకోవొద్దని న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.నిరసనల సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించిన సీసీటీవీ రికార్డులను భద్రపరచాలని అధికారులను ఆదేశించింది.మహిళా జర్నలిస్టుల ఆరోపణలను విచారించేందుకు విశ్రాంత మహిళా న్యాయమూర్తులు, మహిళా ఐపీఎస్ అధికారులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా న్యాయస్థానం పరిశీలించింది.

దిల్లీ మెట్రో ఆంక్షలపై అధికారుల వివరణ

నిరసనల సందర్భంగా మెట్రో స్టేషన్లపై విధించిన ఆంక్షలకు సంబంధించి దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దిల్లీ పోలీసుల సూచనల మేరకే 303 మెట్రో స్టేషన్లలో 45 స్టేషన్ల వద్ద ప్రవేశం, నిష్క్రమణపై ఆంక్షలు విధించామని వివరించింది. గురువారం  షెడ్యూల్ ప్రకారం 4,157 మెట్రో సర్వీసులు నడిచాయని, మొత్తం వ్యవస్థను మూసివేయలేదని పేర్కొంది. అయితే ప్రయాణికుల సంఖ్య సాధారణంగా ఉండే సుమారు 58 లక్షల నుంచి 32 లక్షలకు పడిపోయినట్లు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ నోటీసుకు సంబంధించి డీఎంఆర్‌సీ బేషరతు క్షమాపణ తెలిపింది. దిల్లీ పోలీసులు తమ అఫిడవిట్‌లో గత నిరసనల అనుభవం, నిఘా సమాచారం, ప్రజల భద్రత దృష్ట్యానే ఆంక్షలు అవసరమయ్యాయని వాదించారు.

హైదరాబాద్‌లో రెండు లక్షల మందితో భారీ మార్చ్, సభ!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రెండు లక్షలమందిని సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రదర్శనను ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు నిర్వహించనున్నారు. దసరా పండుగ తర్వాతనే ఈ మార్చ్ చేపట్టాలని భావిస్తున్నారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన మహేష్ కుమార్ తెలిపారు. రాహుల్ గాంధీ సహా ‘ఇండి’ కూటమి నాయకుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

సీజేపీ నిరసనను అడ్డుకోని హైకోర్టు

దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శుక్ర‌వారం నిర్వహించనున్న నిరసనను ముందస్తుగా నిషేధించేందుకు దిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జాతీయ పతాకాలతో ప్రదర్శనకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం కారణంగా వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మ ధర్మాసనం పిటిషన్‌ను పరిశీలించింది. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల తరఫున ఇచ్చిన హామీని నమోదు చేసింది.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *