నడిరోడ్డుపై నాలుగోస్తంభం!

“ఎంతోమంది జర్నలిస్టులు సొంత ఇళ్లులేక, అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జర్నలిస్టుల ఇళ్ల సొసైటీలో సభ్యత్వం ఉన్నా అది కేవలం చెప్పుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడటం లేదు. సొంతస్థలం, సొంతిల్లు ఆశతో ఎదుచుస్తూనే, తమ కలలు నెరవేరక, తనువులు చాలిస్తున్న జర్నలిస్టులు ఎందరో! ప్రభుత్వ అధికార్లు, ప్రజాప్రతినిధుల చేతుల్లోనే అధికారం ఉంటుంది కనుక వారి పనులు తేలిగ్గా అవుతున్నా, జర్నలిస్టుల సమస్యను మాత్రం నానబెడుతున్నారన్న విమర్శ ఉన్నది . ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తామంటూ ఊరిస్తున్నా, ఎప్పటికి కొలిక్కి వొచ్చేనో తెలియని పరిస్థితి నెలకొన్నది !..”

సమాజంలో నిరంతరం శ్రమిస్తూ, ఉద్యోగ భద్రత లేని జర్నలిస్టుల కంటే ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు), ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులకే ప్రాధాన్యత లభిస్తుందనే  అసంతృప్తి క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. హైదరాబాద్‌లో 1988 తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి, ఈ ప్రక్రియ నిలిచిపోవడానికి దారితీసిన ప్రధాన కారణాలు, తాజా పరిస్థితులు పరిశీలిస్తే, ఇళ్ల స్థలాల వ్యవహారం దశాబ్దాలుగా కోర్టు వివాదాల్లో నలిగింది. ముఖ్యంగా 2008లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ సొసైటీ కి కేటాయించిన స్థలాలు సుదీర్ఘ కాలం పాటు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. కారణాలు ఏమైనప్పటికీ అనధికారిక అంచనాల ప్రకారం ఇళ్ల స్థలం కల నెరవేరకుండానే ఇప్పటివరకు మరణించిన జర్నలిస్టుల సంఖ్య 70వరకు ఉండవొచ్చు. ఈ మధ్యనే  మూడు రోజుల వ్యవధిలో  సీనియర్ జర్నలిస్టు, ఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ చీఫ్ ఎడిటర్ అవ్వారి రఘు (63), సీనియర్ జర్నలిస్టు వడ్డూరి శ్రీనివాసరావు (64) మరణించారు. వీరిద్దరూ నాలుగు దశాబ్దాలుగా వృత్తి ని నమ్ముకునే జీవించారు. ఇండ్ల స్థలాల కోసం ఎంతో  ఎదురుచూసారు.

 2024 నవంబర్ లో  సుప్రీంకోర్టు (సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్) హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు), ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు , జర్నలిస్టులకు రాయితీ  ధరలపై ప్రత్యేకంగా స్థలాలు కేటాయించడాన్ని రాజ్యాంగ విరుద్ధం (ఆర్టికల్ 14 ఉల్లంఘన) అని పేర్కొంటూ గత జీఓ లను కొట్టేసింది. జర్నలిస్టుల సేవలను లేదా వారి అభద్రతను సుప్రీం కోర్టు తక్కువ చేసి చూడలేదు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ప్రకారం ప్రభుత్వ భూమి అనేది ప్రజలందరి ఆస్తి. ప్రభుత్వ స్థలాలను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు (ప్రాథమిక విలువకు) ఏ ఒక్క వర్గానికి (ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, లేదా జర్నలిస్టులు ఎవరికైనా) ప్రత్యేకంగా కేటాయించడం రాజ్యాంగబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు లేదా అధికారులకు కూడా ప్రత్యేక కోటా కింద ప్రభుత్వ స్థలాలు ఇవ్వడాన్ని కోర్టు అంగీకరించడం లేదు. ఇలా సమాజంలోని ఉన్నత, ప్రత్యేక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ స్థలాల కేటాయింపులు చేయడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై వేసిన రివ్యూ పిటిషన్లను కూడా ఆగస్టు 2025 లో కోర్టు తిరస్కరించింది. ఈ కోర్టు తీర్పుల కారణంగానే ప్రభుత్వం నేరుగా పాత పద్ధతుల్లో స్థలాలు ఇవ్వడానికి చట్టపరమైన ఆటంకాలు ఏర్పడ్డాయి.

ప్రభుత్వాలు మారినా ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు , రాజకీయ నాయకులకు త్వరగా పనులు జరిగిపోవడం, కనీస వేతనాలు , ఉద్యోగ భద్రత లేని జర్నలిస్టులకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు మిగలడం వల్ల జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసనలు (ఉదాహరణకు ‘చలో హైదరాబాద్’ వంటి కార్యక్రమాలు) చేపడుతూనే ఉన్నాయి.ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ పరంగా జీతభత్యాలు, పెన్షన్లు ఉంటాయి కాబట్టి, వారి కంటే జర్నలిస్టులకే హౌసింగ్ పరంగా ఎక్కువ మద్దతు అవసరమన్న డిమాండ్‌ను జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వం ముందుంచుతున్నాయి. అందుకే, సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి ఉంటూనే , జర్నలిస్టులను ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా గుర్తించి వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం లీగల్ ఆప్షన్లను పరిశీలిస్తున్నది .

ముఖ్యంగా జర్నలిస్టులకు స్థిరమైన వేతనాలు, పీఎఫ్, గ్రాట్యుటీ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ఉద్యోగ భద్రత లేదనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వాలు కొన్ని సొసైటీలకు భూములు కేటాయించినట్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో జర్నలిస్టుల చేతికి రాకుండానే వివాదాల్లో కూరుకుపోయాయి.కోర్టు తీర్పులు, భూముల ఆక్రమణల వంటి సమస్యలు ఉన్నప్పటికీ, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల గృహ వసతి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నది .ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులను ఇతర ఉన్నతాధికారులతో పోల్చకుండా, వారికున్న ప్రత్యేక ఇబ్బందులను (ఒత్తిడి, అభద్రత) దృష్టిలో ఉంచుకునే “సార్వత్రిక జర్నలిస్టుల హౌసింగ్ పాలసీ” ని రూపొందిస్తామని, చట్టపరమైన సమస్యలు రాకుండా త్వరలోనే స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

జర్నలిస్టులందరికీ వర్తించేలా ఒక సమగ్రమైన “యూనివర్సల్ జర్నలిస్ట్స్ హౌసింగ్ పాలసీ” ని తీసుకువొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఇందులో భాగమే! రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటీవల (అక్టోబర్ 2026 లో) మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించి తీరుతామని, తన పదవీకాలంలోనే అర్హులకు ప్లాట్లు కేటాయిస్తామని పునరుద్ఘాటించారు.

జర్నలిస్టుల కోసం గతంలో కేటాయించిన పేట్ బషీరాబాద్ (సుమారు 38 ఎకరాలు) వంటి స్థలాల్లో ఆక్రమణలు జరగకుండా ఇటీవల ‘హైడ్రా’ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టింది. ఇదిలావుండగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వివాదాస్పద పాత స్థలాలకు ప్రత్యామ్నాయంగా, హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక “ఫ్యూచర్ సిటీ” లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.  ప్రస్తుతం తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా అర్హులైన జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియ (ఆధార్ అనుసంధానం, డూప్లికేట్ పేర్ల తొలగింపు) కొనసాగుతున్నది .

చట్టపరమైన నిబంధనలు (సుప్రీంకోర్టు ఆర్డర్స్), సరైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న కసరత్తుల వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని  ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం జర్నలిస్టులు ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితో, త్వరితగతిన స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు సొంత ఇళ్లులేక, అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జర్నలిస్టుల ఇళ్ల సొసైటీలో సభ్యత్వం ఉన్నా అది కేవలం చెప్పుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడటం లేదు. సొంతస్థలం, సొంతిల్లు ఆశతో ఎదుచుస్తూనే, తమ కలలు నెరవేరక, తనువులు చాలిస్తున్న జర్నలిస్టులు ఎందరో! ప్రభుత్వ అధికార్లు, ప్రజాప్రతినిధుల చేతుల్లోనే అధికారం ఉంటుంది  కనుక వారి పనులు తేలిగ్గా అవుతున్నా, జర్నలిస్టుల సమస్యను మాత్రం నానబెడుతున్నారన్న విమర్శ ఉన్నది . ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తామంటూ ఊరిస్తున్నా, ఎప్పటికి కొలిక్కి వొచ్చేనో తెలియని పరిస్థితి నెలకొన్నది !

– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *