సీఈసీపై ప్రజా అభిశంసన రేప‌టికి వాయిదా

– దిల్లీలో వర్షం కారణం
– శనివారం ఖర్గే నివాసంలో కార్యక్రమం
– నవంబర్ 1న దిల్లీ చలో యథాతథం
– మీరాకుమార్ అధ్యక్షతన ప్రతీకాత్మక విచారణ
– కేంద్రం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది
– విపక్షాల ఆరోపణ

దిల్లీ, ప్రజాతంత్ర | అక్టోబర్ 30: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్వహించాల్సిన ప్రతీకాత్మక ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని ఇండి కూటమి శనివారానికి వాయిదా వేసింది. దిల్లీలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అక్టోబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలోనే కార్యక్రమం నిర్వహించనున్నారు.శుక్రవారం దిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లో ఖర్గే నివాసం ఎదుట ఇండియా కూటమి నాయకులతో కలిసి రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. అందరి ఏకాభిప్రాయంతో కార్యక్రమాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న భారీ నిరసన సభను యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలను దిల్లీలోకి రాకుండా అడ్డుకునేందుకు కేంద్ర హోంమంత్రి ప్రయత్నిస్తున్నారని కూడా విమర్శించారు.మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన శనివారం ప్రతీకాత్మక అభిశంసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఖర్గే తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా, రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 21 రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు పౌరసంఘాల సభ్యులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెబుతున్న వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహక వర్గాలు వెల్లడించాయి. సుమారు 30 మంది ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్–కన్నాట్ ప్లేస్ కూడలి నుంచి రామ్‌లీలా మైదాన్ వరకు ప్రదర్శన నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మార్గాన్ని రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.అయితే దిల్లీ పోలీసులు ఇచ్చిన అనుమతిలో రామ్‌లీలా మైదాన్ కాకుండా ఇతర ప్రాంతాలకు ప్రదర్శనగా వెళ్లరాదనే షరతు ఉంది.
నిరసనలు, రాబోయే భారీ సభ నేపథ్యంలో దిల్లీలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపును నవంబర్ 16 వరకు పొడిగించారు. సుమారు 270 కంపెనీల బలగాలు దిల్లీ పోలీసులకు సహకరించనున్నాయి. అక్టోబర్‌లో ఈ మోహరింపు గడువును పొడిగించడం ఇది మూడోసారి. దిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ శుక్రవారం మాట్లాడుతూ, నవంబర్ 1 సభ కోసం 200 నుంచి 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటాయని వివరించారు. సభ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్ శుక్రవారం ఇండియా కూటమి సభకు మద్దతు ప్రకటించారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *