– అనుమతుల వివాదంతో కార్యక్రమ స్థలం మార్పు
– 30న ప్రతిపక్షాల ప్రత్యేక కార్యక్రమం
– నవంబర్ 1న దిల్లీలో భారీ సభ
– రామ్‌లీలా మైదాన్ సభకు పోలీసుల షరతులు
– సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై ప్రతిపక్షాల అభ్యంతరాలు
– కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ
దిల్లీ, అక్టోబర్ 28 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి అక్టోబర్ 30న నిర్వహించనున్న ప్రతీకాత్మక ప్రజా అభిశంసన కార్యక్రమానికి వేదిక మారింది. దిల్లీలోని అశోక్ హోటల్, రామ్‌లీలా మైదాన్లలో కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతుల సమస్యలు ఎదురయ్యాయని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 30, శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లో కార్యక్రమం జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ప్రకటించారు. వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని ప్రశ్నించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. ప్రజా అభిశంసన కోసం తొలుత అశోక్ హోటల్ ప్రాంగణాన్ని ఎంపిక చేశామని, అనంతరం రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నించామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అయితే పోలీసుల జోక్యంతో అనుమతులు లభించలేదని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండి కూటమి నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో భారీ నిరసన సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సభకు పోలీసులు శాంతిభద్రతల కోణంలో నిరభ్యంతర పత్రం జారీ చేశారు. అయితే సంబంధిత భూమి యాజమాన్య సంస్థ అనుమతి కూడా అవసరమని స్పష్టం చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలి. మైదానంలో రాత్రిపూట బస చేయకూడదు. సభా ప్రాంగణం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రదర్శనగా వెళ్లరాదు. సీసీటీవీ కెమెరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వలంటీర్ల ఏర్పాట్ల బాధ్యత నిర్వాహకులదేనని పోలీసులు పేర్కొన్నారు. బుధవారం తాజా వార్తా కథనం ప్రకారం సభ కోసం 2,500 నుంచి 3,000 మంది పోలీసులను మోహరించేందుకు దిల్లీ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. అదనంగా ఇతర ప్రాంతాల నుంచి పది కంపెనీల బలగాలను రప్పించనున్నారు. సభా ప్రాంగణాన్ని 14 భద్రతా జోన్లుగా విభజించనున్నారు. దాదాపు 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వెయ్యి మంది పోలీసులకు బాడీ కెమెరాలు అందించాలని ప్రతిపాదించారు.
ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు
ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే జరిగాయని సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అయితే ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి గతంలో వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ వివరణను పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకుల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ, ఎన్నికల సంఘం అంతర్గత ఫైళ్లు, నిర్ణయాలకు సంబంధించిన నోటింగ్స్, అధికారిక సమాచారాన్ని భద్రపరచాలని కోరారు. మంగళవారం జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వివాదంలోని అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై పిటిషనర్లు సమాధానం సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ తదుపరి విచారణను నవంబర్ 17కు నిర్ణయించింది.
కాంగ్రెస్ పై బీజేపీ ధ్వజం
కాంగ్రెస్ దేశంలో అరాచకాన్ని, ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. అక్టోబర్ 27న గోవాలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ప్రజాస్వామ్యం బాగుందని చెప్పే కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తోందన్నారు. ఎస్ఐఆర్ కొత్త ప్రక్రియ కాదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ వోటర్ల జాబితాల ప్రత్యేక సవరణలు జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు ప్రతిస్పందనగా దేశవ్యాప్తంగా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





